నేతన్నచౌరస్తా, సెప్టెంబర్ 8 : సిరిసిల్ల పట్టణంలోని పలు చోట్ల వినాయక మండపాలను అదరహో అనిపించేలా అందంగా అలంకరించారు. సాధారణంగా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా తీర్చిదిద్దారు. భారీ సెట్టింగ్, బొమ్మల కొలువు, కృత్రిమ కొండలు, గుట్టలు, తాత్కాలిక కొలను, అందులో అందమైన పుష్పాలు ఇలా అందంగా అలంకరించారు.
శివయ్య తలనుంచి గంగమ్మ జలధార, ప్రజల్లో అవగాహన పెంచేలా హరితహారం, మట్టి వినాయకుల ప్రతిమలతో డెకరేషన్లు చేశారు. ఇలాంటి డెకరేషన్లను రోషన్లు అని పిలుస్తుండగా, వీటిని నిమజ్జనానికి రెండు రోజుల ముందు ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ డెకరేషన్లను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సాయంత్రం ఏడు నుంచి రాత్రి 11గంటల వరకు పట్టణంలో జాతర వాతావరణం నెలకొన్నది.