స్వరాష్ట్రంలో ప్రగతి ఫలాలు గడపగడపకూ చేరుతున్నాయి.. ఆ ఇల్లు.. ఈ ఇల్లు కాదు, ఏ ఇంటిలో చూసినా వెలుగులు నిండుతున్నాయి.. ఆది నుంచి సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవలి కాలంలో మరింత జోరు పెంచింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నది. ఇటు పథకాల అమలుతోపాటు అటు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసి సబ్బండవర్గాలకూ మేలు చేస్తున్నది. దీంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాల దాడితో ఠారెత్తిపోతున్నాయి. చెప్పడానికి, డిమాండ్ చేయడానికి ఏదీ లేక నోరెళ్లబెట్టడం తప్ప, మాట పెగలని దుస్థితిలోకి జారుకున్నాయి. ప్రజల ముందుకెళ్తే పరాభవం, తిరస్కారం తప్పదనే సంకేతాలతో ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. – కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ పేద ప్రాంతం కాదు, సమైక్య వాదులు వెనక్కినెట్టివేయబడ్డ ప్రాంతం. స్వరాష్ట్రం సాధిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తం. ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఆచరణలో అక్షర సత్యమవుతున్నాయి. ఇప్పటికే విపక్షాల ఊహకు సైతం అందని ఎన్నో పథకాల ద్వారా లబ్ధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలు అమలవుతుండగా, లక్షలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. అప్పుడే కాదు, ఇప్పుడూ అదే బాటలో పయనిస్తున్నది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో రైతు రుణమాఫీ చెల్లింపు ప్రక్రియ ఆలస్యమైందని స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే చెప్పారు. అయినా విపక్షాలు మాత్రం రైతులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశాయి.
ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయదంటూ విమర్శలు చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి లక్షలోపు ఉన్న బ్యాంకు లోను చెల్లిస్తూ పూర్తిగా రుణమాఫీ చేశారు. తాజాగా చేసిన రుణమాఫీతో ఉమ్మడి జిల్లా పరిధిలో 3,64,599 మంది లబ్ధి పొందారు. మరోవైపు బీసీ బంధు జోరు కొనసాగుతున్నది. మొదటి విడుత కింద నియోజకవర్గానికి 300 మందికి లబ్ధి కలిగిస్తుండగా, అందుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. స్థానిక ఎమ్మెల్యేలు, లబ్ధిదారులకు చెక్కులు అందిస్తుండగా, కులవృత్తిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అలాగే మైనార్టీ బంధు పథకం కింద త్వరలోనే లబ్ధిదారులకు చెక్కులు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హుల ఎంపికకు సంబంధించిన పరిశీలన కొనసాగుతున్నది. మరోవైపు గృహలక్ష్మి పథకం కింద ఉమ్మడి జిల్లాలో లక్షకుపైగా దరఖాస్తులు రాగా, మొదటి విడుత కింద ఈ నెల10లోగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ పథకం కింద అర్హులకు లబ్ధి చేకూరనుండగా, త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ 3,016 నుంచి 4,016కు పెంచారు. పోడు భూములకు పట్టాలివ్వడంతో గిరిజనులు, ఆదివాసీల్లో సీఎం కేసీఆర్ దేవుడిలా నిలిచారు. అన్ని గురుకులాల్లో డైట్ చార్జీలను దాదాపు 26 శాతం పెంచారు. దీంతో ప్రభుత్వంపై ఏటా అదనంగా 2,847 కోట్ల భారం పడినా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్ని అంశాల్లోనూ సంక్షేమ బాటే
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సర్కారు అనేక పథకాల ద్వారా లబ్ధి కల్పిస్తూనే.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, 43 వేల మందికిపైగా కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. సీఎం కేసీఆర్ ఈ సాహసోపేత నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 4వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కలుగడమే కాదు, వారి కుటుంబాలకు ఒక బాసట లభించింది. ఇదే కోణంలో వీఆర్ఏలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ను ప్రజలకు సక్రమంగా అందేవిధంగా ప్రయత్నం చేస్తున్న రేషన్ డీలర్ల విషయంలోనూ ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నది. రేషన్ డీలర్లకు ప్రస్తుతం క్వింటాల్‌కు 70 చొప్పున ఇస్తున్న కమీషన్‌ను రెట్టింపు చేసి 140కి పెంచింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని 1965 మంది రేషన్ డీలర్లు లబ్ది పొందేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న 13 డిమాండ్లను సైతం పరిష్కరించింది.
ప్రతిపక్షాలు బేజారు
ప్రభుత్వం ముందు నుంచీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు గడపగడపకూ చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రతిపక్షాలకు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మార్గం లేకుండా పోయింది. అయితే ఉన్న ఒక్క రుణమాఫీని అడ్డుపెట్టుకొని రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. అయినా రైతులు వారి మాటలు వినలేదని, కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్నారని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది. దీంతో విపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. రుణమాఫీపై మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏం చెప్పాలో తెలియక.. మేం డిమాండ్ చేస్తేనే రుణమాఫీ చేశారంటూ కొత్త డ్రామాకు విపక్ష నాయకులు తెరలేపారు. తాజాగా ఇస్తున్న బీసీ బంధు, త్వరలో ఇవ్వనున్న మైనార్టీ బంధుతో పాటుగా ఇప్పటికే అమలు అవుతున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ఫలాల వంటివి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెల వ్యవధిలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులకు మేలు చేసేలా 12కుపైగా పథకాలను ప్రకటించడంతో ఏం చేయాలో తెలియక ఆగమాగమవుతున్నాయి. సంక్షేమపథకాలతోపాటు ఆర్టీసీ వీలీనం, వీఆర్ఏల క్రమబద్ధీకరణ చేయడంతో ప్రతి పక్షాల నాయకులు అసలు మాట్లాడేందుకు సబ్జెక్టు లేక తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అస్ర్తాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి రావడంతో ఆయా పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
నెల రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినవి ఇవే..