Shaadi Mubarak cheques | కోరుట్ల, జూలై 19: షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ముహమ్మద్ ముజాహిద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జివాకర్ రెడ్డికి షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయాలని కోరుతూ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు జరిగి సంవత్సరం దాటినప్పటికీ షాదీ ముబారక్ చెక్కులు జారీ కాకపోవడం వల్ల బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి బడ్జెట్ మంజూరై కేవలం ముద్రణ, పంపిణీ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న చెక్కులను క్లియర్ చేసి ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ బారి, మహమ్మద్ నజీబ్ తదితరులు పాల్గొన్నారు.