పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు పాలనంతా అధికారుల చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికే ఐదు నెలలుగా పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తుండగా.. గురువారం నుంచి మండల, జిల్లా పరిషత్‌లలో అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్లు నియమించగా.. వారంతా గురువారమే బాధత్యలు స్వీకరించారు. స్థానిక సంస్థల చట్టాల ప్రకారం ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సి ఉన్నా.. ఇప్పట్లో అవి జరిగేలా లేవు. అసలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైనా ప్రభుత్వం స్పష్టతనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతోపాటు ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? లేక మారుతాయా..? అన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. దీంతో ఆశావహుల ఆశలు ఆవిరవుతుండగా, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే డిమాండ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నది.
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫిబ్రవరి ఒకటి నుంచే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 1,214 గ్రామ పంచాయతీల్లో ఐదు నెలలుగా కొనసాగుతున్నది. అయితే, పాలన అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, పాలకవర్గాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజలు చెబుతున్నారు. అలాగే, గురువారం నుంచి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలం గురువారమే (జూలై 4న) ముగియగా.. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం రాత్రే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. పల్లె నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ వరకు పాలన అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయినట్టయింది.
పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గతేడాది డిసెంబర్లోనే ఆదేశాలు జారీ చేసింది. జీపీ పాలకవర్గాల గడువు ఫిబ్రవరి ఒకటితో పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని అప్పట్లోనే కలెక్టర్లకు ఆదేశాలు (లెటర్ నంబర్ 921/టీఎస్ఇసీ-పీఆర్/2023) జా రీ చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తా జాగా విడుదల చేసింది. అక్కడితో ఆగకుండా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో..? వారికి తగ్గట్టుగా ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను ఎంతమందిని నియమించాలో నిర్దేశిస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల మేరకు చూస్తే.. రాజ్యాంగంలోని 243(3)(ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘమే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కానీ, రిజర్వేషన్లు, బీసీ జనాభా గణన వంటి అంశాలు తేలకపోవడంతో పంచాయతీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పంచాయతీల్లో ఫిబ్రవరి ఒకటి నుంచే ప్రత్యేక పాలన నడుస్తున్నది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. అందుకోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఆచరణలోకి తేవాలి. కానీ, ఆనాటి నుంచి నేటి వరకు అధికారుల పాలనే కొనసాగుతున్నది. లోతుగా చూస్తే 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీంకోర్టు పలు ఆదేశాలు ఇచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు ఖరారు చేశారు. బీసీలకు 22.79 శాతం, అలాగే ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు జరిపారు. అయితే, వివిధ రాష్ర్టాల్లో వివిధ పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు అప్పట్లో నిర్వహించగా, చాలా రాష్ర్టాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ (మన రాష్ట్రంలో బీసీ కమిషన్) నియమించాలని సూచించింది. సదరు కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతూనే, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని స్పష్టం చేసింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే.. బీసీ రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరమున్నది. ఇవి తేలాలంటే బీసీ కులగణన అయినా జరగాలి, లేదా ఓటర్ల ప్రాతిపదికన వివరాలు సేకరించి రిజర్వేషన్లు కల్పించాలి. అది కూడా 50 శాతం లోపే ఉండాలి.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రస్తుతం సమస్యగా మారుతున్నది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అంతేకాకుండా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని చెప్పింది. తద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని, బీసీ వర్గాల్లో ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ డిక్లరేషన్‌లో స్పష్టం చేసింది. అయితే, ఓవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దు. మరోవైపు బీసీ కులగణన జరగాలి. వీటిపై ప్రభుత్వం ఇప్పటి వరకు బీసీ కమిషన్‌కు స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదు. ఇవన్నీ చూస్తే ప్రత్యేకాధికారుల పాలన ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది.