Free eye surgeries | కోల్ సిటీ, ఏప్రిల్ 9: కంటిచూపుతో బాధపడుతున్న 45 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు బుధవారం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్ లో ఇటీవల ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి సూచనల మేరకు ఫౌండేషన్ ప్రతినిధి లంక సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న 45 మందిని గుర్తించి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి బుధవారం గోదావరిఖని నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని కంటి దవాఖానకు తీసుకువెళ్లి విజయవంతంగా ఆపరేషన్లు చేయించినట్లు ఫౌండేషన్ సభ్యుడు లంక సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో దినచర్య ప్రారంభం కావాలంటే కంటి చూపు ముఖ్యమని, కంటి సమస్యతో బాధపడుతూ ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు ఆలయ ఫౌండేషన్ ద్వారా వ్యయ ప్రయాసలు భరించి ఉచితంగా ఆపరేషన్ చేయించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి మార్గదర్శకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. తమకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి చూపును ప్రసాదించిన ఫౌండేషన్ సభ్యులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ తిట్ల రమేష్ బాబు, కీర్తి నాగార్జున, నరేష్, సుకుమార్, వెంకటేష్, కిరణ్, సదానందం, రాజేష్, ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ తోపాటు బస్తి పెద్దలు పాల్గొన్నారు.