Dharmapuri | ధర్మపురి, డిసెంబర్ 29: పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పలువురు పేదవిద్యార్థులకు ఫేస్ బుక్ మిత్రులు రూ.2.71లక్షల విరాళాలతో 56 మంది విద్యార్థులకు 56 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మపురి, బీర్పూర్ మండలాలకు చెందిన పలువురు విద్యార్థులు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే వారివారి గ్రామాల నుండి ఉన్నత విద్య కోసం కొంతదూరంగా ఉన్న పక్కగ్రామాలకు నడుచుకుంటూ పాఠశాలలకు వెలుతున్నారు.
అయితే వీరి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి పేదవిద్యార్థులకు సైకిళ్లను అందజేసి వారి చదువుకు తోడ్పడదామని మిత్రులను కోరుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు స్పందించిన పలువురు దాతలు రూ.2.71లక్షల విరాళాలను అందజేయగా వాటితో 56 సైకిళ్లను కొనుగోలు చేశారు. సోమవారం ధర్మపురి పట్టణంలోని న్యూటీటీడీ కల్యాణమండపంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వేదిక ద్వారా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చేతులమీదుగా సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేయించారు.
ఈ సందర్భంగా డీస్పీ మాట్లాడుతూ ఇలాంటి సేవాకార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున పేదవిద్యార్థుల కోసం మరో రెండు సైకిళ్లను అందజేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఒక సైకిల్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలకు,సామాజిక సేవకునికి విద్యార్థులు, తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐ మహేశ్, ఎంఈవో సీతాలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.