రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ వార్డు అధికారులను ఈ సర్వేలో భాగస్వాముల్ని చేసింది. ఒక్కొక్కరూ 120-170వరకు కుటుంబాల చొప్పున 56అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించగా, ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అయితే సర్వే పూర్తయి నాలుగు నెలలు అవుతున్నా పారితోషికం ఇవ్వకపోవడంపై సర్వే చేసిన సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కోనరావుపేట, మార్చి 30: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గతేడాది చేపట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో 1,531మంది ఎన్యూమరేటర్లు, 150మంది సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 120 నుంచి 170 కుటుంబాల వరకు సర్వే చేసి వివరాలను సేకరించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొత్తంగా 1,93,310 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎనిమిది పేజీలతో కూడిన సర్వే ఫారంలో 75రకాల ప్రశ్నలతో ఎన్యూమరేటర్లు ఎంతో ఓపికతో వివరాలు నమోదు చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో 10నుంచి 18రోజుల్లోనే సర్వే పూర్తి చేసి చేశారు. అంతేకాకుండా రెండో విడుతలో సైతం సర్వే చేయించారు. అయితే ఇప్పటికీ చేసిన సర్వేకు గౌరవ వేతనం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు 10వేలు, సూపర్వైజర్లకు 12వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తు చొప్పున రూ.25ఇస్తామని చెప్పింది. జిల్లాలో 1,93,310 కుటుంబాల డాటా ఎంట్రీ కోసం 1,300కు పైగా ఆపరేట్లతో డాటా ఎంట్రీ చేయించారు. దీంతో కులగణన సర్వేచేసిన వారికి సుమారు 2కోట్లు వరకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం గత నవంబర్లో కులగణన సర్వే చేయించి మాతో డాటా ఎంట్రీ చేయించింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక.. ఉపాధి కోసం అధికారులు చెప్పగానే డాట్రా ఎంట్రీ చేసేందుకు వెళ్లిన. డాటా ఎంట్రీ చేసి నాలుగు నెలలైనా ఇప్పటికీ డబ్బులిస్తలేరు. ఒక్కో దరఖాస్తుకు ఎంత పారితోషికం ఇస్తారో కూడా చెప్పలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదంటున్నరు. కలెక్టర్ స్పందించి గౌరవ వేతనం అందించాలి.
కులగణన సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన. 237ఇండ్ల వివరాలను ఆన్లైన్ నమోదు చేసిన. నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఇంకా డాటా ఎంట్రీ పైసలిస్తలేరు. ఉపాధి లేకపోవడంతోనే డాటా ఎంట్రీ చేసేందుకు వెళ్లిన. కానీ ఇలా డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా. అధికారులు ప్రత్యేక చొరవ చూపి డబ్బులు చెల్లించాలి.