Korutla | కోరుట్ల, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్ చేశారు. గురువారం కోరుట్ల డివిజన్ కేంద్రంలోని అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, బీడీ కార్మికులు ఏఐటీయూసీ, ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఒకరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మెరుపు సమ్మె చేశారు.
ఈ సందర్భంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. కార్మికుల హక్కులైనా 29 చట్టాలను నిలుపుదల చేసి నాలుగు లేబర్ కోడులను పార్లమెంటులో ఆమోదం కు పెట్టారని పేర్కొన్నారు. నల్ల చట్టాల అమలుతో కార్మికుల సమ్మె హక్కు, సామాజిక భద్రత, ఇతర హక్కులు సంక్షేమ పథకాలు కోల్పోతారని పేర్కొన్నారు, 8 గంటల పని దినానికి బదులు 12 గంటలు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కార్మికులంతా ముక్తకంఠంతో బ్రిటిష్ ప్రభుత్వం తో పోరాడి సాధించుకున్న ఈ చట్టాల కొనసాగింపుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, అంగన్వాడీ మధ్యాహ్న భోజన ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ అంగన్వాడి అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి, జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు మహ్మద్ ఉస్మాన్, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సరస్వతి, పద్మ, భాగ్య, మున్సిపల్ వర్కర్స్ జిల్లా నాయకులు గంగారం, అశోక్, రమేష్, సాయి, శ్రీకాంత్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.