Vemulawada | వేములవాడ, జూలై 9 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర సదన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ‘సరళ నిలయం’ అతిథి గృహానికి వేదమంత్రోచ్ఛారణాల మధ్య గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అతిథి గృహ నిర్మాణానికి మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, ఏకశిల ఏద్యుకేషన్ సొసైటీ వరంగల్ వారు దాతలుగా సహకరిస్తున్నారు.
ఇదే ప్రాంగణంలో గతంలో 2007 మార్చి 28న తొలి అతిథి గృహం నిర్మించగా, ప్రస్తుతం దాని పైభాగంలో భక్తుల వసతి సౌకర్యాలను మరింత విస్తరించే లక్ష్యంతో మరో నూతన అతిథి గృహాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దాతలు, వారి కుటుంబ సభ్యులు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు దాతలకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ దాతలను శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, కండువాతో ఘనంగా సత్కరించారు. నూతనంగా నిర్మించనున్న ‘సరళ నిలయం’ అతిథి గృహం పూర్తయిన అనంతరం వేములవాడకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.