రాయికల్, మే 23: కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీజన్ ముగుస్తున్నా వడ్లు కొనకుండా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు రైతు గోస తగులుతదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. ఏ కొనుగోలు కేంద్రం చూసినా కుప్పలు తెప్పలుగా ధాన్యం కనిపిస్తున్నదని, కొనుగోళ్లను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. శనివారం ఆలూరులోని కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎక్కడి ధాన్యం అక్కడే ఉందన్నారు.
ధాన్యం కొనాలని ధర్నా చేసినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని చూస్తే ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పంట పండించడం ఒక ఎత్తయితే, అమ్ముకోవడం ఇంకో ఎత్తవుతుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని సూచించారు. ఇక్కడ నాయకులు బరం మల్లేష్, ఆనంద్ రావు, సుధాకర్, పాక్స్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచులు స్వామిరెడ్డి, గంగాధర్, నాయకులు ఎండీ చాంద్, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఆడెపు కృష్ణ, నందు నాయక్ పాల్గొన్నారు.