జగిత్యాల, జనవరి 17 : రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నదా..? ఫ్యాక్షన్ ప్రభుత్వం నడుస్తున్నదా..? అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదని, బీఆర్ఎస్ నేతల ఆత్మైస్థెర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో ఎప్పటికీ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.
గంగాధర మండలం బూరుగుపల్లిలోని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా, శుక్రవారం ఆమె మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఇతర నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా దావ వసంత దాడిని ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, పదేళ్లలో ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే రాష్ట్రంలో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు? వారి వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరి చరణ్రావు, మాజీ జడ్పీటీసీలు రామ్మోహన్రావు, నాగం భూమయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.