వేములవాడ, మే 23: కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టిన మాట వాస్తవం కాదా.. నేడు ఆ పార్టీ నాయకులు గల్ఫ్ కార్మికుల మీద దొంగ ప్రేమ చూపిస్తూ కాలయాపన చేస్తున్నారని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన వేములవాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన విధ్వంసంతో ఈ ప్రాంత ప్రజలు గల్ఫ్‌బాట పట్టారన్నారు. వారి హయాం లో గల్ఫ్‌లో అనుకొని సంఘటనలో శిక్ష అనుభవించిన్నప్పుడే గుర్తుకు రాని కార్మికులు.. ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా.. అంటూ విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీరు, తాగునీరు అందుబాటులోకి తీసుకురావడంతో రైతు కుటుంబాలు వలస వెళ్లకుండా ఇక్కడే ఎవుసం చేసుకుంటున్నారన్నారు.
మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతుంటూ.. ఈ ప్రాంత మంత్రి అమెరికాకు.. ఎమ్మెల్యే దుబాయ్‌కి వెళ్లడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న చల్మెడ లక్ష్మీనరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమన్నారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేవరకు ఆం దోళనలు చేపడుతామన్నారు. ఇక్కడ నాయకులు పొలాస నరేందర్, గడ్డం హన్మాండ్లు, గంగ మహేశ్, కట్కం మల్లే శం, జోగిని శంకర్, వాసాల శ్రీనివాస్, చీటి సంధ్యారాణి, సయ్యద్‌బాబా, అంజాద్పాషా, రాకేశ్, మైలారం రాము, హరీష్‌గౌడ్, ఫర్వీజ్, ఆసద్ పాల్గొన్నారు.