Chigurumamidi | చిగురుమామిడి, జూలై 14 : పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు చిగురుమామిడి మండలంలోని మాజీ సర్పంచులు హైదరాబాద్ కు సీఎం కు వినతిపత్రం ఇచ్చేందుకు మంగళవారం వెళ్తుండగా చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా మాజీ సర్పంచ్లను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. సాయంత్రం సమయంలో వ్యక్తిగత పూచిపై వారిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన రామంచ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు జక్కుల రవి, సన్నీల్ల వెంకటేశం, గోలి బాపురెడ్డి, బెజ్జంకి లక్ష్మణ్, నాగెల్లి వకులాదేవి భర్త సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు సీఎం వద్దకు శాంతియుతంగా వినతిపత్రం అందజేసేందుకు వెళుతున్న మాజీ సర్పంచ్లను ముందస్తుగా పోలీసులచే అరెస్టు చేయడం సమంజసం కాదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని లేనియెడల మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అరెస్టులకు భయపడేది లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.