బీహార్ చరిత్రలో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీకి ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దశాబ్దాల కంచుకోట బద్దలైంది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ‘జన్ సురాజ్’ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిని భారీ తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. ఉపఎన్నికలో జయాపజయాల ఫలితాలు సాధారణ ఎన్నికల్లో ప్రతిఫలించవన్న వాదన పాక్షిక సత్యమే. కానీ ఎన్నో సందర్భాల్లో అధికార పార్టీలకు ప్రమాదఘంటికలు మోగించినవి ఉపఎన్నికలే.
బాంకీపూర్ ఉపఎన్నికలో పరాజయంతో అధికార పార్టీకి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో తక్షణ ప్రమాదం ఏదీ లేకపోయినప్పటికీ త్వరలో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫలితం ప్రభావం చూపిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేం. జెన్ జీ ఉద్యమం ఊపం దుకున్న తరుణంలో బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితం ప్రాధాన్యం సంతరించుకున్నది. సర్వసాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయిగా ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ పప్పులు ఉడకవు. అధికార పార్టీ పరాజయాలు, గెలిచిన తగ్గిపోయిన ఓట్ల శాతాలు, సర్వశక్తులు మోహరించినా స్వల్ప తేడాతో గట్టెక్కడాలు ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతంగా.. ఒక హెచ్చరికగానే భావించాలి. దేశ రాజకీయ చరిత్రలో ఉప ఎన్నికలు భవిష్యవాణిని వినిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి 9 నెలలైనా పూర్తికాలేదు. ఆ ఎన్నికల్లో బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితిన్ నబీ 52 వేల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. కాగా, బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఎంత మార్పు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ 2010 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. నవీన్ తండ్రి కిశోర్ కూడా నాలుగుసార్లు పాట్నా వెస్ట్ పేరుతో ఉన్న అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎన్నికల రంగంలోకి కొత్తగా దిగిన ప్రశాంత్ కిశోర్ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఎన్నికల ప్రచార సందర్భంగా బాంకీపూర్‌లో ‘కుక్కనో పిల్లినో నిలబెట్టినా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఇపుడు ఓటమి కారణాల విశ్లేషణలో మునిగి తేలుతున్నారు.
2025 చివర్లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో బాంకీపూర్‌లో బీజేపీకి వచ్చిన ఓట్లు 98,299. కానీ తొమ్మిది నెలలకే జరిగిన ఈ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 44,794. తేడా ఐదో పదో కాదు ఏకంగా 54 వేల ఓట్లు. ఓట్ల శాతం 63 నుంచి 34కు పతనమైన దైన్యస్థితి. పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనిదే బాంకీపూర్ నియోజకవర్గం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యాధికులు ఎక్కువ ఉండే ప్రాంతం. గంగా నదికి దక్షిణతీరం వైపు ఉన్న బాంకీపూర్ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. సహజంగానే ఇవి బీజేపీకి అనుకూలించే అంశాలు. కనుకనే మూడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించింది. కానీ పీకే ప్రయోగించిన బీహార్ అస్తిత్వ నినాదం ముందు వెలవెలబోయింది.
ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో బీజేపీ సహా ఎన్నో రాజకీయ పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన పీకే సొంతంగా ‘జన్ సురాజ్’ పార్టీని 2024 చివర్లో స్థాపించి అనతికాలంలోనే ఉనికిని చాటుకున్నారు. ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అన్నట్లు పీకేకి జెన్ జీ తరం వెన్నుదన్నుగా నిలచింది. దానికి తోడు ఆయన ‘జై బీహార్ నినాదం’, ఇక్కడి ప్రజల వలస బతుకుల పట్ల స్పందించిన తీరు, ప్రధానంగా నిరుద్యోగంపై, ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన విమర్శలు బాంకీపూర్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి.
మరోవైపు ఉద్యమిస్తున్న యువతరాన్ని, నిరుద్యోగులను కించపరుస్తూ బీజేపీ సోషల్ మీడియా దేశద్రోహులతో, మతోన్మాద శక్తులతో అంటగడుతూ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. పాట్నా నగరం, ఇతర ప్రాంతాల్లో ఉన్న యువతరం బాంకీపూర్పై దండెత్తింది. ఇతర రాష్ర్టాలతో పోల్చుకున్నప్పుడు అతిపెద్ద రాష్ట్రమైన బీహార్ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడం యువత ఆగ్రహానికి కారణమైంది. బీజేపీ ఓటమి, ప్రశాంత్ కిశోర్ ఎన్నిక ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశం కాదు. నిస్తేజమైన ప్రభుత్వాలకు, యువతరానికీ మధ్య జరిగిన పోరాటంగానే భావించాలి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ బాంకీపూర్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ఇపుడు తాను అన్నమాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.
1990 నుంచి 2025 దాకా 35 ఏండ్లపాటు బీహార్‌ను ప్రాంతీయ పార్టీలైన లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలే పరిపాలించాయి. ఇన్నాళ్లకు జాతీయ పార్టీ బీజేపీకి అవకాశం వచ్చింది. ఒకప్పుడు నితీష్ వెంట నడిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించి నితీష్‌ను తన వెంట తిప్పుకొంటున్నది.
లాలూ ప్రసాద్ యాదవ్ శకం ముగిశాక ఆర్జేడీ బలహీనపడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు బీహార్ రాజకీయాలను శాసించే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో బీహార్ తమదే అనుకుంటున్న బీజేపీకి జన్ సురాజ్ పార్టీ ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా నూతనంగా ఆవిర్భవించి సవాల్ విసిరింది. ఆ పార్టీ అధినేత పీకే విజయం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరదీసింది.