ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలు, హామీలు ప్రజలను ఆకర్షించేందుకు చేసే ప్రచార ప్రకటనలు మాత్రమే కాదు, అవి ప్రజలతో కుదుర్చుకునే ఒక సామాజిక ఒప్పందం. ప్రజలు ఓటు వేయడం అంటే ఆ హామీలను విశ్వసించి, తమ భవిష్యత్తును ఆ పార్టీకి అప్పగించడం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడం ప్రభుత్వాలకు రాజకీయ, నైతిక బాధ్యత. అయితే పార్టీల హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగునపడిపోవడం బాధాకరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డిక్లరేషన్లు దిక్కులేకుండా పోయాయి.
ఎన్నికల ముందు వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామని, వారి వృత్తులకు పునరుజ్జీవం కల్పిస్తామని, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం గొప్పలు చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా గీత కార్మికులు, నేతన్నలు, గంగపుత్రులు, ముదిరాజ్లు, యాదవులు, విశ్వకర్మలు, రజకులు వంటి అనేక బీసీ, ఎంబీసీ, వృత్తి వర్గాలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభిస్తామని నమ్మబలికింది. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడచినా హామీలు అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడటంతో బీసీ సంఘాలు, మేధావులు, ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి హామీకీ ప్రజలు లెక్క అడగడం సహజం. హామీలు అమలయ్యాయా లేదా అని నిర్ధారించే బాధ్యత కూడా పాలకులదే.
బీసీల సంక్షేమానికి ప్రతి ఏడాదీ రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఎంత మొత్తం ఖర్చు చేసింది? ఏ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు? ఎంతమేరకు వృత్తిపరమైన సాయం అందింది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం ఇవ్వాల్సి ఉన్నది. సంక్షేమం గురించి ప్రకటనలు చేయడం కంటే, ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై ప్రజలకు జవాబుదారీతనంతో లెక్క చెప్పడం ప్రభుత్వ బాధ్యత. బీసీలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే చుట్టూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీల జనాభాను తక్కువగా నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించి ఉంటే ఆ నివేదికను ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదు? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే.
ప్రజాస్వామ్యంలో సమాచారాన్ని దాచిపెట్టడం అనుమానాలకు తావిస్తుంది. నివేదికలను బహిర్గతం చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు కళాశాలల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
బీసీల మాదిరిగానే దళితుల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో దళితులకు హామీల వర్షం కురిపించారు. విద్య, ఉపాధి, గృహనిర్మాణం, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతకు కొత్త దిశను చూపిస్తామని ప్రకటించారు. ఆ హామీలను దళిత వర్గాల ప్రజలు నమ్మి మోసపోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడచినా ఆ డిక్లరేషన్లోని హామీలు అమలుకు నోచుకోలేదు. ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామని ప్రకటించిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణానికి రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన హామీ కూడా అమలుకు దూరంగానే ఉన్నది.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధుల విడుదలలో జాప్యం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో మౌలిక వసతుల సమస్యలు అన్నీ కలిపి విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. విద్య అనేది ఒక తరం భవిష్యత్తును నిర్ణయించే రంగం. అలాంటి రంగంలో జాప్యాలు సమాజానికే నష్టాన్ని కలిగిస్తాయి. దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పరిశోధనలు చేసి ప్రభుత్వాలకు విధాన సూచనలు అందించాల్సిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణం కూడా ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడం ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.
దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్యాంకు లింకేజీలు, పూచీకత్తులు లేకుండా ఒకేసారి ఆర్థిక సాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేశాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ‘అంబేద్కర్ అభయహస్తం‘ పేరుతో ప్రతి దళిత కుటుంబానికీ రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని నమ్మబలికింది. ఆ పథకానికి సంబంధించిన స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు, అమలు కార్యాచరణ ఇప్పటికీ ప్రజల ముందుకు రాకపోవడం దళిత వర్గాల్లో నిరాశను పెంచుతున్నది.
ప్రజా సంఘాలు, మేధావులు, బీసీ, ఎస్సీ సంఘాలు ప్రస్తావిస్తున్న సందేహాలకు ప్రభుత్వం వాస్తవాలతో సమాధానం ఇవ్వాలి. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది నేతల ప్రసంగాలు వినడానికి కాదు, తమ జీవితాల్లో మార్పు చూడడానికి. కాంగ్రెస్ ఎన్నికల హామీలు కేవలం ప్రచార పత్రాలుగా మిగిలిపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ నేతలు హామీల అమలును విస్మరించి, ఇంకా మభ్యపెట్టే అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు. ప్రజలు గుర్తుంచుకునేది హామీలు ఇచ్చిన నాయకులను కాదు, ఆ హామీలను నెరవేర్చిన పాలకులను. అందుకే ప్రజాస్వామ్యంలో మంచి పాలనకు అసలైన కొలమానం ప్రచార సభలు కాదు, అమలైన విధానాలు. గుంపు మేస్త్రీ మాటలు ప్రజల కడుపు నింపవు. జనాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది ఆచరణ మాత్రమే. నెరవేర్చిన హామీలు, జవాబుదారీతనంతో కూడిన పాలన, పారదర్శక పరిపాలనే నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తాయి. అదే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం, అదే రాజకీయాల అసలైన విలువ తీసుకోవాల్సిన అవసరం పాలకులకులపై ఉన్నది.
– మన్నారం నాగరాజు