కంటోన్మెంట్, ఆగష్టు 4: ప్రజల పక్షాన పోరాడితే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తారని అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రశించారు. తిరుమలగిరి మండల పరిధిలోని సర్వే నంబర్ 157/1లోని ప్రభుత్వం స్థలం కాపాడి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరితే ఎమ్మెల్యే శ్రీగణేష్ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు నమోదు చేయించాడని దీంతో ఆ ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే శ్రీగణేష్కు రూ.5 కోట్లు ముట్టాయనే విషయం స్పష్టమైందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు.
కార్ఖాన పోలీసులు కేసులు నమోదు చేయడంతో నోటీసులు తీసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జేల నాగేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేధిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, పాండుయాదవ్, శ్యాంకుమార్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్. శ్రీనివాస్, బీఆర్ఎస్ లీగల్ బృందంతో కార్యకర్తలు, నాయకులతో కలిసి వారు మంగళవారం పీఎస్కు వచ్చారు. పీఎస్లో ఏసీపీ రమేష్, సీఐ అనురాధల ద్వారా నోటీసులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేర రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని, రూ.6లక్షలు కట్టాలని, ముందుగా రూ.10 వేలు చెల్లించాలని అంటుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఉచితంగా డబుల్బెడ్రూం ఇండ్ల ఇచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమి పేదలకు వచ్చేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.
బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జేల నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ప్రశ్నించి ప్రజల ముందుకు తీసుకొస్తే బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం తగదని అన్నారు. ప్రభుత్వ భూములు కాపాడమని ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సైనికులు అక్రమ కేసులకు భయపడేది లేదని వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందన్నారు.
బీఆర్ఏస్ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్ మాట్లాడూతూ కార్ఖాన పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని నోటీసులు తీసుకునేందుకు వచ్చామని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, కనకయ్య, సతీష్. గోపాల్, డి. శ్రీనివాస్. కుమార్ ముదిరాజ్,శ్యాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.