గంగాధర, మార్చి 27 : రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీమల్ల మేఘరాజు అన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మాజీ సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, పొట్టల కనుకయ్య, కొంకటి శంకర్ తదితరులు ఉన్నారు.
గన్నేరువరం, మార్చి27: తమ హయాంలో చేసి న అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బి ల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ వెళ్లకుండా మండలంలోని బీఆర్ఎస్ మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మాజీ సర్పంచుల ఫోరం మండ లాధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ సర్పంచులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితం గా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో మాజీ సర్పంచులు గంప మల్లీశ్వరివెంకన్న, పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, శారద శ్రీనివాస్ ఉన్నారు.
చిగురుమామిడి, మార్చి 27 : చిగురుమామిడి మండల మాజీ సర్పంచులను పోలీసులు తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోగా, అసెంబ్లీ సమావేశాల వేళ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు జకుల రవి ఆరోపించారు. అసెంబ్లీ చివరి రోజున ముట్టడి చేస్తామని ప్రభుత్వం మాజీ సర్పంచులను అరెస్టు చేసి కట్టడి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పోలీసుల అదుపులో చిగురుమామిడి, ముది మాణిక్యం, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, జకుల రవి, బోయిని శ్రీనివాస్, సన్నీల్ల వెంకటేశంతో పాటు సీపీఐ మండల కార్యదర్శి నాగెళ్లి లక్ష్మిరెడ్డి తదితరులున్నారు.