గోదావరిఖని, ఏప్రిల్ 7: వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావించిందని, అనుకున్న లక్షాన్ని చేరుకొని రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. నేడు పార్టీ ఆవిర్భవించి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 27న రజతోత్సవ మహాసభ ఏర్పాటు చేశామని చెప్పారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే ఆదర్శంగా నిలిపిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ సభలో భవిష్యత్తుపై దిశానిర్దేశం చేస్తారన్నారు. రామగుండం నియోకవర్గంలోని ఉద్యమకారులు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులు ఈ రజతోత్సవ సభకు తరలిరావాలని, మరోసారి మన తెలంగాణ ఉద్యమ చైతన్యం నింపాలని ఆయన కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, తోకల రమేశ్, తిరుపతి, తదితరులు ఉన్నారు.