మానకొండూర్, ఫిబ్రవరి 18: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్ మండలాధ్యక్షులతో ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలోని మీనాక్షి కన్వెన్షన్హాల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎన్ శ్రేణులు ఎవరూ అధైర్యపడొద్దని, క్యాడర్‌ను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామి ఇచ్చిందని, గ డువు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఎందు కు అమలు చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే దాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు. యాసంగిలో క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం హామీ ఇచ్చిందని ఏప్రిల్, మే మాసాల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని, వర్షాకాలంలోపే మరమ్మతులు పూర్తిచేసి ప్రాజెక్టును కాపాడాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. వేసవికి ముందే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సాగునీటి, కరెంట్ కష్టాలు వచ్చాయని రైతులు వాపోతున్నారని, ఇలా అయితే మున్నుందు చాలా కష్టమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా గ్రామాల్లోని కుంటలు, చెరువులను నింపి భూగర్భజలాలను పెంచడంతో ధాన్యం ఉత్పత్తులు పెరిగి ఆన్నదాతలకు సాగునీటి కష్టాలు తప్పాయని గుర్తు చేశారు. దాదాపు పదేళ్లు తెలంగాణలో రైతులకు సాగునీటి, కరెంట్ కష్టాలు లేవన్నారు.
ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభానికి ముందే రైతులకు సాగు నీటి కష్టాలు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చిచెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిందో..? దానిపై రేవంత్ సర్కార్ విచారణ జరిపించాలని కోరారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలే కానీ, మేడిగడ్డ బరాజ్ కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బూతద్దంలో పెట్టి చూపించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని మండిపడ్డారు. వచ్చే వానకాలంలోగా బరాజ్‌కు మరమ్మతులు చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాల్గొన్నారు.