కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 21: ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు దిగుతున్నది. ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కార్యకర్తలకు నేనొక్కటే చెబుతున్నా. ఎవరూ భయపడొద్దు. మీ అందరికీ పార్టీ అండగా నిలుస్తుంది’ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భరోసానిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్యకర్తలు, నాయకుల కృషి వల్లే తాను మరోసారి గెలిచానని, అందుకు రుణపడి ఉంటానని, ఏ అవసరం వచ్చినా అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రజల పక్షాల నిలబడుతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో మరింత కసితో పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్, బీజేపీలకు భయం పట్టుకున్నదని, ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని లేకుండా చేయాలని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు.
జనవరిలోనే పంట పొలాలకు సాగునీరందించలేకపోతున్నారని, నియోజకవర్గంలోని పలు చెరువుల్లో కూడా నీరు లేదన్న ఆయన, ఇప్పుడే ఇలా అయితే వేసవిని, యాసంగిని ఎలాగట్టెక్కిస్తారని ప్రశ్నించారు. పరిస్థితులు చూసి రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఎంపీపీ పిల్లి శ్రీలత, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, నాయకులు శ్రీనివాస్, జమీలొద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వివరించాలి. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలి. వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి ఎన్నో ప్రాజెక్టులను తెచ్చారు. కానీ బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తేలేదు. కేంద్రంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమే అయినా పైసా పనిచేయలేకపోయాడు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
కరీంనగర్లో అభివృద్ధి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కృషి వల్లే సాధ్యమైంది. ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ తీసుకురాగలిగారు. దీని వల్ల వందల కోట్ల నిధులు రావడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్ల గంగుల కమలాకర్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పోరాడి నిధులు తీసుకువచ్చే సత్తా ఆయనకు ఉంది. వీరికి తోడు ఎంపీగా వినోద్‌కుమార్ ఉంటే మరిన్ని నిధులు వస్తాయి.
– యాదగిరి సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటికి సంబంధించిన జీవోలు ఇవ్వాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. వాళ్లు అన్నట్టు 100 రోజుల లెక్క చూస్తే ఎంపీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునే అవకాశం ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని, ప్రజలే ఆ నిర్ణయాన్ని తీసుకుంటారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పదేండ్లు మోదీ ప్రధానిగా ఉన్నారని, ఇందులో ఐదేళ్లు తాను, ఐదేండ్లు బండి సంజయ్‌కుమార్ ఎంపీగా ఉన్నారని, తాను నగరాభివృద్ధికి రూ.1000 కోట్లు తీసుకొస్తే, బండి సంజయ్ మాత్రం ఐదు రూపాయలైనా తెచ్చారా..? చెప్పాలని సవాల్ విసిరారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆర్వోబీ కోసం కేంద్రానికి విన్నవిస్తే ఇక్కడ ట్రాఫిక్ లేదని మంజూరు చేయలేదన్నారు. అయితే, ఆ ప్రాంతం కార్పొరేషన్ పరిధిలో ఉంటే మంజూరు చేయాలన్న నిబంధన ఉందని తెలుసుకొని దీని కోసం తాము తీగలగుట్టపల్లి గ్రామాన్ని కరీంనగర్లో విలీనం చేసి ఆర్వోబీ తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కూడా కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కొత్తపల్లి సమీపంలో త్రిబుల్ ఐటీ కోసం 50 ఎకరాలను తాము సిద్ధంగా ఉంచామని, బీజేపీ ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.
పులి బయటకు వస్తే వలేసి బంధిస్తామని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఎవరైనా పులిని వల వేసి బంధిస్తారా.. వలలో కుందేళ్లను పడతారు.. పులిని పట్టుకునేందుకు ట్రంక్విలయర్స్ రూపంలో మత్తు మందు ఇస్తారు.. నోరుంది కదా అని రేవంత్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతుండు’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రగల్బాలు మానుకొని రాష్ర్టాభివృద్ధిపై దృష్టి పెట్టాలని చురకలంటించారు.