హుజూరాబాద్ / హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 3 : బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి కానీ, గులాబీ జెండా మాత్రం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్లలో నయా పైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. హుజురాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్లో శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కృతజ్ఞత సభ నిర్వహించారు.
దీనికి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నిజాన్ని ప్రజలు నమ్మకుండా చేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశాయని విమర్శించారు. మనం చేసిన అభివృద్ధిని వివరిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కొనియడారు. వారంటీలేని గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను ఆగం చేసిందని, అయితే వాటిని అమలు చేసేదాకా కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ముఖ్యంగా రైతుల వరి ధాన్యం బోనస్ సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెడుతామన్నారు. గత ప్రభుత్వ పథకాలను అభివృద్ధి నిధుల కింద చూపించడం కేవలం బండి సంజయ్‌కే చెల్లుతుందని, ఎంపీగా ఆయన కేంద్రం నుంచి సొంతంగా ఒక ట్రిబుల్ ఐటీ కళాశాల తెస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేదన్నారు. ఎంపీగా తాను ఉన్నప్పుడు కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా, కేబుల్ బ్రిడ్జీ కోసం కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్, చైర్మన్ గందె రాధిక, తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేశా కాబట్టే మళ్లీ గెలిచా. నా గెలుపులో వినోద్‌కుమార్ పాత్ర చాలా ఉంది. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు వినోద్‌కుమార్ కేంద్రాన్ని ఒప్పించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో శత్రువులు ముప్పేట దాడి చేసినా ప్రజలు నాకు అండగా ఉన్నారు. వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిన అభివృద్ధి శూన్యం. అందుకే ఆయన్ను ప్రజలు ఆదరించలేదు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు కసిగా పని చేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలి. కాంగ్రెస్ అధికారంలో ఐదేళ్లు ఉంటదో.. ఊడుతదో తెలియదు కానీ, ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల్లో ఉంటుంది. తల తెగినా గులాబీని వీడేది లేదు. అధికారంలో లేమని అధైర్య పడకండి. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటాం.
– కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్
కార్యకర్తల సమిష్టి కృషితోనే ఎమ్మెల్యేగా గెలిచా. త్వరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయి. ఎవరూ నారాజు కావద్దు. అందరికీ అండగా ఉంటా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాక విశ్రమించను. పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌కు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేందుకు ప్రతి కార్యకర్తా పని చేయాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 55 వేల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఇచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు శ్రమించాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే