గంగాధర,జూన్ 28 : కాంగ్రెస్ సర్కారు అవగాహన లేకుండా తెచ్చిన యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ అయిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. అటు యాప్‌లో యూరియా లేదని, ఇటు షాపుల్లో లేదని, అలాంటి యాప్ ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఆ యాప్‌ను రద్దు చేసి, గతంలో మాదిరిగా సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో నాయకులు, రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతోపాటు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బంది పడకుండా యూరియా అందించారని గుర్తు చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తే, రైతులను గోస పెట్టడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పని చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతుల వద్ద చిన్న ఫోన్లు ఉన్నాయని, చిన్న ఫోన్లలో యాప్ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఎలాగోలా యాప్‌లో పేరు నమోదు చేసుకుంటే నోస్టాక్ అని చూపిస్తున్నదని వాపోయారు. బోయినపల్లి మండలంలో పేరు నమోదు చేసుకున్న రైతులు ఇల్లంతకుంట మండలానికి వెళ్లి యూరియా తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. యాప్‌ను రద్దు చేసే వరకూ బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, జనగం శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, గంట్ల జితేందర్‌రెడ్డి, కరబూజ తిరుపతిగౌడ్, తైదల శ్రీలత, ద్యావ మధుసూదన్‌రెడ్డి, గడ్డం చుక్కారెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, ఎండీ నజీర్, గంగాధర్, మల్లేశం, శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్, స్వామి, అఖిల్, అజయ్, మల్లయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే రక్షణ. నాడు కేసీఆర్ రైతు బాంధువుడిగా నిలిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి రైతుల పాలిట రాక్షసుడిగా మారిండు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువు, కరెంటు, సాగునీటికి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డరు. ఆ పరిస్థితులను కాంగ్రెస్ సర్కారు మళ్లీ తెచ్చింది. యూరియా యాప్ పేరిట గోస పెడుతున్నది. ప్రభుత్వం ఆ యాప్‌ను రద్దు చేసి, సరిపడా యూరియా అందించాలి.
– ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ (కరీంనగర్)