కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 23 : నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని, వెంటనే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోగా చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాడు తెలంగాణ రాకముందు చొప్ప దండి నియోజకవర్గంలో సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గాన్ని ఒక వాటర్ హబ్‌గా మార్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. అలాంటి ప్రాంతంలో సాగు సాగడం లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
సాగు సాగకపోతే రాష్ట్రంలో ఇంత ధాన్యం ఎకడి నుంచి పండుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 16.50 కోట్ల నిధులను విడుదల చేయించి నిర్వాసితులకు అందించామని గుర్తు చేశారు. రిజర్వాయర్ ఇబ్బందులు తొలగించేందుకు నాలుగు ఓటీలను మంజూరు చేయించి 28 వేల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. కానీ, ఇవాళ భూ నిర్వాసితులు తమ గోడును జిల్లా ఇన్చార్జి మంత్రికి విన్నవించుకుందామని వస్తే కూడా కనీసం వినిపించుకునే స్థితిలో లేరని మండిపడ్డారు.
ఇన్చార్జి మంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి ఈ 14 నెలల కాలంలో ఏం నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విమర్శలు మానుకొని జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు ఆరే రవి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.