కేసీఆర్‌ను విమర్శించడమే రేవంత్ పని
తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా రేవంత్ పని చేస్తున్నడు. వరంగల్ సభలో అత్యంత నీచంగా మాట్లాడిండు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే ముఖ్యమంత్రిపై వ్యతిరేకత మొదలైంది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రగతి జరిగింది. మిడ్‌మానేరు నుంచి మల్కపేట, సింగసముద్రం వరకు కాలువ పనులు పూర్తి చేసినం. సాంకేతిక కారణాలతో నాడు ఆయా ప్రాజెక్టులను ప్రారంభించుకోలేకపోయినం. జిల్లాను అన్నింటా అగ్రగామిగా నిలిపిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే కోరిన పనులన్నీ తామే చేశామని రేవంత్ చెప్పడం విచారకరం. సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుపై అక్రమాలు జరిగింది నిజం కాదా? ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది.
సిరిసిల్ల టౌన్, నవంబర్ 21 : నిత్యం అబద్ధాలు చెబుతూ.. ప్రజల్ని మోసం చేస్తూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి తుపాకి రాముడిలా మారాడని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినోడు, కనీసం ఏ వేదికపైనా జై తెలంగాణ అని అనలేనోడు రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని వాపోయారు. వరంగల్ సభలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన ఆయన, వేములవాడ సభలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, కేటీఆర్ పేరును రామనామంలా జపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వేదికపై అభివృద్ధి గురించి మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కారుకూతలు మానుకొని చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రతి మాటకు కేటీఆర్‌ను జైలుకు పంపుతా అనడం విచిత్రంగా ఉందని, ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల సిరిశాలగా మారడానికి కారణం కేటీఆర్ చేసిన కృషేనని ఉద్ఘాటించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు ఎడారి ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమగా మార్చింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కుప్పకూలిపోయాయని రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పడం రేవంత్ సోయిలేని మాటలకు నిదర్శనమని చెప్పారు. ప్రాజెక్టులు కుప్పకూలిపోతే కొండపోచమ్మ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌కు నీళ్లు ఎట్లా వస్తున్నాయని, హెలీకాప్టర్‌లో వచ్చిన రేవంత్‌రెడ్డికి మిడ్‌మానేరు ప్రాజెక్టులోని నీళ్లు కనిపించలేదా? అని ప్రశ్నించారు. గతంలో రాజన్న మీద ప్రమాణం చేసి రైతులకు 2 లక్షలు రుణ మాఫీ చేస్తానని మోసం చేసింది రేవంత్ అని విమర్శించారు. ధార్మిక, ఆధ్మాత్యిక చింతన కలిగిన గొప్ప వ్యక్తి కేసీఆర్ నాయకత్వంలోనే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. రేవంత్ సభ నిర్వహించిన గుడి చెరువు స్థలాన్ని బీఆర్ఎస్ సర్కారే సేకరించిందని, కట్టపై హెలీకాప్టర్ ఆగిన స్థలాన్ని అభివృద్ధి చేసిందని, పట్టణంలో సుందరీకరణ పనులు చేసిందని గుర్తు చేశారు. ఇవన్నీ తెలియకుండా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల యాదాద్రి ఆలయ అభివృద్ధిని చూసి రేవంత్‌రెడ్డి బిత్తిరి చూపులు చూశారని, ఆ మానసిక ఒత్తిడితోనే కేసీఆర్ విమర్శించడం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. వేమలవాడ సభా వేదికగా జిల్లాకు మెడికల్ కాలేజీ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు చెప్పుకుంటున్న రేవంత్ వైఖరి చూస్తుంటే ఎవరికో బిడ్డను తనకే పుట్టినట్టు చెప్పుకుంటున్నట్లుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 68వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. రేవంత్ చెప్పినట్టు నియమించిన 50వేల ఉద్యోగులను ఎల్బీ స్టేడియంకు పిలిపించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తాము బహిరంగ చర్చకు వస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ ముస్తాబాద్ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, దిడ్డి రాజు, దార్ల సందీన్, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, న్యాలరకొండ రాఘవరెడ్డి, అడ్డగట్ల మురళి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, పోచవేని ఎల్లయ్యయాదవ్, కుంభాల మల్లారెడ్డి, పాతూరి రాజిరెడ్డి, వీరగోని శ్రీనివాస్‌గౌడ్, సబ్బని హరీశ్, కంచర్ల రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై రైతులు, నేతన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. కానీ, వారికి నిరాశే మిగిలింది. సీఎంతోపాటు చేనేత జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సిరిసిల్లకు వచ్చి నేతకార్మికుల కుటుంబాల కష్టాలు తెలుసుకుంటే బాగుండేది. వేములవాడకు వచ్చి పక్కనే ఉన్న సిరిసిల్లకు రాకపోవడం చూస్తే నేతన్నల సంక్షేమంపై వారికి పట్టింపు లేదని అర్థమవుతున్నది. నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం బాధాకరం. గతంలో కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలతో సమీక్షించి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించారు. కానీ, ఇప్పుడు ఆర్డర్లు ఇస్తామంటూ కాలం ఎల్లదీస్తున్నారన్నారు. టెస్కోలో పని చేస్తున్న ఉద్యోగులు ఎంతోమందిని తొలగించారు. వేములవాడలో యారన్ డిపో ప్రారంభాన్ని వర్చువల్ విధానంలోనే నిర్వహించడం బాధాకరం. 50 కోట్ల ముడిసరుకు కొన్నామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం పెట్టిన పావులా వడ్డీ, చేనేత మిత్ర, చేనేతకు చేయూత పథకాలను కొనసాగిస్తున్నామన్న మీకు వీటిపై కనీస అవగాహన ఉందా? చెప్పాలి.