చొప్పదండి, జూలై 10: చొప్పదండిలో నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. భవనం పూర్తయి ఏడాది గడిచినా ప్రారంభించకపోవడం ఏంటని ధ్వజమెత్తారు. పదిహేను రోజుల్లో స్పందించకపోతే నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి తామే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన చొప్పదండిలోని దవాఖాన భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లగా, పోలీసులు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. అనుమతి ఉంటేనే లోపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. ఎవరితో అనుమతి తీసుకోవాలని నాయకులు ప్రశ్నించగా.. దవాఖానకు సంబంధించిన వారితో పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. దీంతో వాగ్వాదం జరగ్గా.. దవాఖాన ఎదుట గంటసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
నాయకులు గేటు ఎకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు లాగి వేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి గంట తర్వాత పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన సరిపోక ప్రజలకు ఇబ్బంది పడడం తాము గుర్తించి, అప్పటి సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అప్పుడు వంద పడకల దవాఖానతోపాటు రూ.37.50 లక్షలు నిధులు 2023లో మంజూరు చేశారని చెప్పారు. ప్రభుత్వ భూమి లేక పోతే ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సంబంధించిన మూడెకరాలను విద్యాశాఖ అనుమతి మేరకు కలెక్టర్‌తో మాట్లాడి కేటాయించామన్నారు.
దవాఖాన భవనం నిర్మాణమై ఏడాది గడిచినా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి తేవడం లేదని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందక ప్రైవేట్ దవాఖానకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దవాఖాన అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కారు నిరంకుశ పాలన చేస్తున్నదని ధ్వజమెత్తారు. భవనాన్ని సందర్శించేందుకు వస్తే అడ్డుకొని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం అమానుషమని మండిపడ్డారు.
దవాఖానను ప్రారంభిస్తే చొప్పదండి, రామడుగు, గంగాధర, ధర్మారం, పెగడపల్లి, జులపల్లి, ధర్మారం మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, దవాఖానను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, కౌన్సిలర్ కొత్త సుమలత- గంగారెడ్డి, సర్పంచులు బంధారపు అజయ్‌కుమార్, వడ్లూరి లక్ష్మి- భూమయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్, మాజీ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నలుమాచు జ్యోతి- రామకృష్ణ, నాయకులు ఏనుగు స్వామిరెడ్డి, లోక రాజేశ్వర్‌రెడ్డి, గాండ్ల లక్ష్మణ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, జహీర్, అజ్జు, శ్రీనివాస్, కనుకయ్య, అనిల్ ఉన్నారు.