గంగాధర, నవంబర్ 24: కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని మండిపడ్డారు. సోమవారం ఆయన గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించగా, విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. పదిహేను రోజులుగా కూరగాయల భోజనం పెట్టడం లేదని, ముద్ద కట్టిన అన్నం, పప్పు పులుసుతోనే తింటున్నామని వాపోయారు. చలికాలంలోనూ చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నామని, బాత్రూంలు సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని ఆవేదన చెందారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో విద్యార్థులకు సకల సదుపాయలతో నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించినట్టు గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. గురుకులాల్లో బాత్రూంలు సరిగా లేక విద్యార్థులు ఉదయం 3 గంటలకే నిద్రలేచి చన్నీటి స్నానం చేస్తున్నారని, ముద్దకట్టిన అన్నం, పప్పు, చారే వారికి నిత్య భోజనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పదిహేను రోజులుగా పాఠశాలకు కూరగాయలు రావడం లేదని, ఆర్సీవోకు ఫోన్ చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా ఆగిపోయిందని వివరించినట్టు తెలిపారు. విద్యార్థులు ముద్దకట్టిన దొడ్డు బియ్యం అన్నం తినలేకపోతున్నారని వివరించారు. పాఠశాల భవనానికి రక్షణ గ్రిల్స్ లేవని, గతంలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకుల కంకణాల విజేందర్‌రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, దూలం శంకర్‌గౌడ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.