Former MLA Satish Kumar | చిగురుమామిడి, ఆగస్టు 8: ఏ సమస్య వచ్చినా తానున్నానని, అండగా ఉంటానని, బిఆర్ఎస్ పార్టీకి ఇది తాత్కాలిక విరామమని, రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ సైనికులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం దిశగా అందరం కృషి చేయాలన్నారు.
గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. బిఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రైతులకు సాగునీరు అందించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయే దిశకు చేరుతుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గులాబీ శ్రేణులు ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో సైదాపూర్, ఎల్కతుర్తి మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.