ఇల్లంతకుంట, మార్చి 10 : అన్నపూర్ణ, రాజరాజేశ్వర ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పంటలు ఎందుకు ఎండుతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇల్లంతకుంటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో రాష్ర్టానికే గుండె కాయలాంటి ప్రాజెక్టులున్నా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నీళ్లు రావడం లేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలోనూ అన్ని గ్రామాల్లో చెరువులను మత్తడి దుంకిచామని, ఒక్క రైతు కూడా సాగు నీటి కోసం రోడ్డు ఎక్కలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతులకు కష్టాలే మిగిలాయని, ప్రస్తుత ఎమ్మెల్యే రైతులను పట్టించుకోకపోవడం వల్లే సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఎం 6 కెనాల్ నిర్మాణం పూర్తి చేస్తే 9500 ఎకరాలకు సాగు నీరు అందించడానికి అవకాశం ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం మండిపడ్డారు. కిలోమీటర్ దూరం కాల్వ కోసం 1.25 కోట్ల నిధులు ఆర్థిక శాఖలో క్లియర్ చేస్తే కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారన్నారు. ఎమ్మెల్యే తక్షణమే కాలువ నిర్మాణ పనులు చేయించి రైతులకు సాగు నీరు అందేలా చూడాలని, లేకుంటే బీఆర్ఎస్ నాయకులూ రైతులకు మద్దతుగా నిలిచి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాచారం, బోటిమీది పల్లి గ్రామాలలో ఫారెస్టును చదును చేసి రాళ్ళను తొలగించి కిలోమీటర్ దూరం పైపులైన్ వేసి రైతులకు సాగు నీరందించి అండగా నిలిచినట్లు చెప్పారు. ఇక్కడ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ పరుశరాం, మాజీ సర్పంచ్ గొడిసెల జితేందర్ గౌడ్, సాదుల్, బొప్ప శ్రీనివాస్, బాగయ్య, దేవెందర్ రెడ్డి, బాస్కర్, మహేశ్, నరేశ్, బలరాం, రఘు, కొట్టె వెంకన్న, సతీష్, బాలగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల దీక్షకు మద్దతు
సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని పెద్దలింగాపూర్ గ్రామంలో రైతులు వారం నుంచి దీక్ష చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన ఆరు గ్రామాల రైతులు ఈ దీక్షలో కూర్చున్నారు. సాగునీరు విడుదల చేసే వరకు రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు.