మానకొండూర్, అక్టోబర్ 18: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో ఈనెల 20న నిర్వహించనున్న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ ‘అలయ్‌బలయ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది దస రా తర్వాత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘అలయ్‌బలయ్’ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వేడుకకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తదితరులు హాజరవుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా.. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం విడ్డూరమన్నారు. రైతులు చేతికొచ్చిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడమే కాకుండా.. సొసైటీ చైర్మన్లపై పెత్తనం చెలాయించడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్నిరకాల వడ్లకు క్వింటాల్‌కి 500 బోనస్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, గంట మహిపాల్, రావుల రమేశ్, మ హిపాల్‌రెడ్డి, గంప వెంకన్న, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, మర్రి కొండయ్య, బొయిని కొమురయ్య, బోడ రాజశేఖర్ పాల్గొన్నారు.