ఇల్లంతకుంట, మే 5 : ‘మక్కలు అమ్మడానికి అరిగోస పడుతున్నం. ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాళ్లే కొంటంది. మిగిలినయ్ దళారులకు అడ్డికి పావుసేరుకు అమ్ముకుంటున్నం’ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మంగళవారం రసమయి ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న క్రమంలో కేశన్నపల్లె వద్ద మక కంకులు ఏరుతున్న రైతులను చూసి వాహనం నిలిపి, రైతు ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి పలుకరించారు. ఈ సందర్భంగా ‘ఒకప్పుడు మా నల్లరేగడి భూముల్లో చినుకు చుక పడితేనే పత్తి సాగు చేసుకునెటోళ్లం. కానీ, ఐదారేళ్ల సంది కేసీఆర్ సారు పుణ్యమా అని నీళ్లకు డోకాలేకుండా పోయింది. అనంతగిరి డ్యాం కట్టి, కాల్వలు తీసి సాగు నీళ్లిచ్చినంక వానకాలం పత్తి, యాసంగిల పొద్దు తిరుగుడు లేక మక సాగు చేస్తూ ఏడాదికి మంచిగ పంటలు పండిస్తున్నం’ అని సంతోషంగా తెలిపారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట చెబుతూ, నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. ఇది రైతులను పీకుతినే ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున మక్కలు బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు.