తిమ్మాపూర్/తిమ్మాపూర్ రూరల్, జనవరి19: ఎన్నిక ల ముందు కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూర్ నియోజకవర్గంలో కమీషన్ల పాలనపై ప్రజలు ప్రతాపం చూపుతారని, మోసకారి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు సి ద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆదివారం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షు డు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన హాజరయ్యా రు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రమంతా ఒక లెక్క ఉంటే మానకొండూర్‌లో ఒక లెక్క ఉందన్నారు. ఎమ్మె ల్యే కవ్వంపల్లి కమీషన్ల కక్కుర్తితో నియోజకవర్గ పేరు ప్రతిష్టలను మంటలో కలుపుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన అంతర్గత సర్వేలో అత్యంత అవినీతిపరుల జాబితాలో రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో రెండో స్థానంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వారి సర్వే ప్రకారం 25 శాతం మంది ఇష్టపడితే, 75 శాతం మంది కవ్వంపల్లిని ఇష్టపడడం లేదని చెప్పారు. రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి, నియోజకవర్గాన్ని కవ్వంపల్లి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ నీతిమంతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు చేసిండని కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులు ఎక్కడని, సమగ్ర సర్వే ఏమైందని ప్రశ్నించారు.
ఎన్నో చేశాను.. నువ్వేం చేశావ్..?
మండలానికి, నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని, ఎమ్మెల్యే సత్యనారాయణ ఈ ఏడాది పాలనలో ఏం చేశాడో చెప్పాలని రసమయి ప్రశ్నించారు. కమీషన్లు తీసుకోవడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. ఒకప్పుడు మొగిలిపాలెం బెల్ట్‌లో యాసంగి పంటలు పండకపోయేవని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత భూమికి బరువయ్యేలా వడ్లు పండేలా నీళ్లు తీసుకు వచ్చానన్నారు.
రేషన్ కార్డుల పేరుతో దగా..
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డుల పేరుతో ప్రజలను ఆగం చేస్తున్నదని రసమయి విమర్శించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పది శాతం పేర్లు రాలేదని, ఆ పార్టీ నాయకులు క్యాంపు ఆఫీసులో కూర్చుని సెలెక్ట్ చేశారని దుయ్యబట్టారు. ఒక గ్రామంలో వందల మంది దరఖాస్తు చేసుకుంటే 55 మంది పేర్లు వచ్చాయని, వాటిని కూడా అధికారులు సర్వే చేసి కొన్ని తొలగిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రశ్నించడం వల్లే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామని ప్రకటించారని చెప్పారు. అన్ని పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికం అయినప్పుడు రేషన్‌కార్డులు పూర్తిస్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రేణికుంటలో రేవంత్ హామీ ఏమైంది..
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి రేణికుంట గ్రామంలో పెద్ద మీటింగ్ పెట్టి రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తామన్నారని, ఎవరికి వచ్చినయ్..? అని రసమయి ప్రశ్నించారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు అన్నారని, అది కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇస్తున్నట్లు ప్రకటించారని, ఇంటికి రూ.50 వేలు ముడితేనే ఇల్లు మంజూరైతున్నదని ఆరోపించారు.
మానేరును తోడేస్తరు
నీళ్లివ్వడం చేతకాని సర్కారు, ఉన్న నీటిని ఓడగొట్టి ఇసుకను తోడేందుకు మంత్రి పొంగులేటి పన్నాగం పన్నాడని, ప్రభుత్వం ఆల్రెడీ కాంట్రాక్టులు ఇచ్చేసిందని రసమయి ఆరోపించారు. ఎల్ఎండీతోపాటు మిడ్‌మానేరును పూడిక పేరుతో ఇసుకను దోస్తారని చెప్పారు. పొంగులేటి కాలువలు తవ్వితే తెగిపోతున్నాయని, డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్టు ఇస్తే రామకృష్ణకాలనీలో నిలిపివేసి వెళ్లిపోయాడని విమర్శించారు.
ప్రశ్నించండి.. చర్చించండి
కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఏ భయం లేకుండా ప్రశ్నించాలని, మోసాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని శ్రేణులకు రసమయి పిలుపునిచ్చారు. గతంలో ఎలా చేశాం.. ఇప్పుడెలా ఉందో..? వివరంగా చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, వేరే రాష్ర్టాలకు బతకపోయే పరిస్థితి రానున్నదని చెప్పారు. తాను ఇక్కడే ఉంటానని, త్వరలోనే తొలిపొద్దు కార్యక్రమం చేపట్టి పల్లెలకు వస్తానని పేర్కొన్నారు. ఎవరూ ఆగం కావద్దని, ఆగం చేయాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల్లో అభ్యర్థులను గెలిపించుకుందామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మనమే గెలవబోతున్నామని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ పిలుపునిచ్చారు. కాగా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోస్టులు పెట్టిన పాపానికి కేసులపాలైన మన్నెంపల్లికి చెందిన సుదగోని సదయ్య లాంటి కార్యకర్తలకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలాధ్యక్షుడు రావుల రమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం, సొసైటీ చైర్మన్లు గుజ్జుల రవీందర్‌రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, రాధాకిషన్‌రావు, నాయకులు బోయిని కొమురయ్య, యాదగిరి వెంకటేశ్వర్రావు, మాతంగి లక్ష్మణ్, మీసాల అంజయ్య, పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, సాయిళ్ల కొమురయ్య పాల్గొన్నారు.
కేసులకు భయపడద్దు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారు. కేసులతో ఎవరికీ ఏమీ కాదు. కేసు పెట్టామని పోలీసులు పిలిస్తే దొరలాగా వెళ్లి నోటీసులు తీసుకోండి. మనమేం దేశద్రోహం, నేరాలు చేయడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెట్టే కేసులతో అయ్యేది లేదు.. పోయేది లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టండి. పార్టీతో పాటు ప్రజల్లో పేరుంటేనే ఎన్నికల్లో గెలవగలుతాం. స్థానిక ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. వ్యక్తిత్వాన్ని బట్టే ఓట్లు వేస్తారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ బలంగా ఉండాలి. గెలిచినప్పుడు ఎలా ఉన్నామో..? ఇప్పుడూ అలాగే ఉన్నాం. ఎక్కడికైనా వెళ్తే ప్రజలు మనల్నే గౌరవిస్తున్నారు.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు