మానకొండూర్, జనవరి 5: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు రూ. 7,500 ఇస్తామని, ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు.
ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికే ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని అడ్డుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.