మంథని, జూలై 11: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. వరంగల్ సభను ఏ విధంగా సక్సెస్ చేశామో అదే రీతిలో రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తాను చాటాలన్నారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని, నాయకులు సంసిద్ధం కావాలన్నారు.
ముఖ్యంగా పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ తీరును ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. స్థానిక సమరంలో మంథని పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగురాలని, అందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, యాకుబ్, మాచీడి రాజుగౌడ్, గొబ్బూరి వంశీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.