కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 19 : గోదావరిని మళ్లీ నిండుకుండలా మార్చకుంటే అదే గోదావరి నదిలో ఆమరణ దీక్షకు దిగుతామని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని, ప్రతి గ్రామం నుంచి ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరించారు. పాదయాత్రలో భాగంగా కలిసిన ప్రజలంతా మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు చేపట్టిన గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర మూడోరోజు బుధవారం ఉదయం కరీంనగర్ నుంచి ప్రారంభమైంది. రాత్రి వరకు అల్గునూర్ మీదుగా బెజ్జంకి ఎక్స్‌రోడ్‌కు చేరుకున్నది.
ఉదయం కరీంనగర్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడారు. గోదావరి తలాపునే ఉన్న గోదావరిఖనిలో పది రోజులకోసారి తాగునీరు వచ్చే దుస్థితి ఉందని వాపోయారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో నీటి సమస్య పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చారని, భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి గోదావరిని నిండుకుండలా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆడిన అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి గోదావరి నదిని ఎడారిలా మార్చారని విమర్శించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని చెబుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరి ఎందుకు వినియోగంలోకి తేవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని రైతులు, ప్రజలపై చూపించి కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, రఘువీర్‌సింగ్, మాజీ కార్పొరేటర్ ఐలేందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.