పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 10 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని, అమాయక రైతులను కాంగ్రెస్ నట్టేటా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు నాట్లేసి రెండో దఫా యూరియా వేద్దామకుంటే ఎక్కడా దొరకని పరిస్థితి ఉందని, అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతులందరికీ సరిపడా యూరియా ఇచ్చేదాకా వదిలేది లేదని, అప్పటి దాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
యూరియా అందించే వరకు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అన్నదాతకు మద్దతుగా బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో భారీ రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్ నుంచి కమాన్ చౌరస్తా వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి దాసరి మనోహర్‌రెడ్డి ర్యాలీ తీశారు. అనంతరం అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని, 15వేల రైతుబంధు ఇస్తామని మభ్యపెట్టి, తీరా గద్దెనెక్కాక అరకొర రుణమాఫీ చేసిందని, రెండు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిందని, 12వేలు ఇచ్చి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులు యూరియా దొరకక అరిగోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ రైతులు రోడ్డెక్క లేదని, కానీ, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారని దుయ్యబట్టారు. రైతుల అన్ని విధాలా నష్టపోతున్నారే తప్ప ఏ విధంగా లబ్ధిపొందలేదని ఆవేదన చెందారు.
ధాన్యం కొనే గతిలేకనే పంటల దిగుబడి తగ్గించేందుకు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. పొట్ట దశలో ఎరువులు వేయకుంటే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంలో అదనపు కలెక్టర్ డీ వేణుకు యూరియా అందించాలని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, మాజీ జడ్పీటీసీలు గంట రాములు, వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మోహన్‌రావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకులు గుణపతి, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, మోబిన్, పెంచాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని బస్తాలు ఇక్కడే దింపండి
ఎలిగేడు, సెప్టెంబర్ 10: సుల్తాన్పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్దకు బుధవారం ఉదయం 4.30ప్రాంతంలో 600 బస్తాల లోడ్‌తో లారీ వచ్చింది. ఈ విషయం తెలిసి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూ కట్టారు. అయితే ఇక్కడ 400 బస్తాలే దించుతారనే విషయం తెలిసి ఆందోళనకు దిగారు. అన్ని బస్తాలూ ఇక్కడే దింపాలని పట్టుబట్టారు. మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు రైతుల పక్షాన ఏవో ఉమాపతి, స్థానిక ఎస్ఐ మధూకర్‌తో మాట్లాడి, పూర్తి లోడు దింపించి రైతుకు రెండు బస్తాల చొప్పున ఇప్పించారు.
200 మందికి నిరాశేసైదాపూర్లో ధర్నా
సైదాపూర్, సెప్టెంబర్ 10: సైదాపూర్ మండల రైతులు మూడు నాలుగు రోజుల నుంచి ప్రతిరోజూ మండల కేంద్రంలోని సహకార సంఘం గోదాం వద్దకు వచ్చి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. తమ లైన్ పోతుందని చెప్పులను క్యూలోపెట్టి బస్తాల కోసం ఎదురుచూసినా ఫలితం లేక ఆగ్రహిస్తున్నారు. బుధవారం వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్‌విండో వద్ద హుస్నాబాద్-హుజూరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపతి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
యూరియా కోసం ప్రాణాల మీదకు..
గంగాధర, సెప్టెంబర్ 10: యూరియా కోసం రైతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటునారు. బుధవారం గంగాధర మండలం కురిక్యాల సొసైటీకి యూరియా బస్తాలు వస్తున్నాయని సమాచారం తెలుసుకొని, దాదాపు 500 మంది రైతులు పొద్దటి నుంచి బారులుతీరారు. తీరా 240బస్తాలు మాత్రమే రావడంతో ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరుగగా, కురిక్యాల గ్రామానికి చెందిన సాయిళ్ల రాజమల్లు సృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి రైతులు, కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పోలీసుల పహారాలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు.
300 మందిలో 40 మందికే..
ముస్తాబాద్, సెప్టెంబర్ 10 : ముస్తాబాద్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ దుకాణంలో మంగళవారం యూరియా పంపిణీ చేయగా, 40 బస్తాలు మిగిలాయి. ఈ విషయం తెలియక రైతులు బుధవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 300 మంది చెప్పులు వరుసలో పెట్టి, గంటల తరబడి క్యూలో ఉన్నారు. దీనిని గమనించిన సిబ్బంది ముందస్తుగా పోలీసులను రప్పించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పహారా మధ్యన ఆ 40 బస్తాలు పంపిణీ చేశారు. దాదాపు 250 మందికిపైగా బస్తాలు దొరక్క తీవ్ర నిరాశ చెందారు. గంటల తరబడి క్యూలో ఉన్నా ఒక్క బస్తా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం ఇస్తే తాము పనులు వదులుకొని వచ్చే వాళ్లం కాదని వాపోయారు.