పెద్దపల్లి, జూన్3: తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. సోమవారం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా దాసరి మనోహర్‌రెడ్డి జాతీయ జెండాను, అనంతరం బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించి, పలు అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే కాదు పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనపై ప్రజల్లో ప్రజావ్యతిరేకత మొదలైందని, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ది వసుదైవక కుటుంబమని, కొంత మంది పార్టీని వీడినా పెద్ద నష్టమేమి లేదన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసి రాష్ట్ర సర్కారు ప్రజావ్యతిరేక విధాలను ఎండగట్టాలన్నారు. రానున్న కాలంలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జడ్పీటీసీలు గంట రాములు, నారాయణ, రఘువీర్ సింగ్, బండారి శ్రీనివాస్, గోపు ఐలయ్య యాదవ్, పీటీ స్వామి, ఉప్పు రాజ్‌కుమార్, మార్కు లక్ష్మణ్, ఉష తదితరులు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులే గెలుస్తురు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. మంథని నియోజకవర్గంలో మట్టి, ఇసుక దందా జోరుగా సాగుతున్నది. దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది. మంథనిలో మంత్రి తమ్ముడు పెత్తనం సాగిస్తున్నడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. అండగా మేమున్నాం. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దాం. – పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నది. ఆరు నెలల కాలంలోనే ప్రజావిశ్వాసాన్ని కోల్పోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలను ప్రజలు గమనిస్తున్నరు. సమయం వచ్చిన కర్రుకాల్చి వాత పెడుతరు.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినం అని బాధపడద్దు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం భయపడద్దు. మీకు అండగా మేమున్నం. రాబోయే కాలం బీఆర్ఎస్దే. మనం ఇంకా బలంగా తయారు కావాలి. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచి మరింత ముందుకు సాగాలి.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే