పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పిన్రు. రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని నమ్మించిన్రు. తీరా గెలిచాక ముంచుతరా..?’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కేవలం 33 నుంచి 40 శాతం మందికి మాఫీ చేసి అందరికీ చేశామని చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని, ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని, రైతు భరోసా డబ్బులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు గంట రాములు, దాసరి ఉష, రైతులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి ఇక మీ ఆటలు సాగవు. తొమ్మిది నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు భయపడుతున్నరు. రేవంత్‌రెడ్డి అస్తవ్యస్త పాలనపై జనం విసిగు చెంది తిరబడేందుకు సిద్ధమవుతున్నరు.
ఇది అంతం కాదు, ఆరంభం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాటం చేస్తుందని, ఎలాంటి ఆంక్షలు, కొర్రీలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, తగరం శంకర్‌లాల్, ఏగోళపు శంకర్‌గౌడ్, మార్కు లక్ష్మణ్, కాపరబోయిన భాస్కర్, బండారి శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ సతీశ్, అత్తె చంద్రమౌళి, ఆకుల స్వామి వివేక్ పటేల్, రామారావు, నూనె కుమార్, పెంచాల శ్రీధర్, మేకల సంపత్, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆరెపల్లి కుమార్, మంథని లక్ష్మణ్, జంజర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ అయ్యే దాకా వదలం
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేసే దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ యేడాది ఆగస్టు 15లోగా 2లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ల మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, అక్టోబర్ నెల వచ్చినా అందరికీ మాఫీ చేయలే. ఏదో కొద్దిపాటి మందికి మాఫీ చేసి చేతులు దులుపుకుంటామంటే ఊరుకోం. పెట్టుకున్న గడువులోగా మాఫీ చేయనందుకు రేవంత్‌రెడ్డి రైతులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి.
– కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే (రామగుండం)
రైతుల గోస చూడు
కాంగ్రెస్ ప్రభుత్వామా కండ్లు తెరిచి రైతుల గోస చూడు. పిరికేడు మంది రైతులకు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకోవద్దు. మంథని నియోజకవర్గానికి చెందిన చిట్టెటి రాజయ్య అనే రైతుకు 35వేలే మాఫీ కాలేదు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? చీమలు పెట్టిన పుట్టలో పాములు సొచ్చినట్లు, కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తెస్తే రేవంత్ రెడ్డి సీఎం అయి ఢిల్లీకి కప్పం కడుతుండు. ఇకనైనా కప్పం కట్టడం ఆపి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించు.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే (మంథని)
పొట్టకొడితే ఊరుకోం
కాంగ్రెస్ అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని 420 హామీలు ఇచ్చి, మోసం చేసింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, తొమ్మిది నెలలైనా అతీగతీ లేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు సకాలంలో పడుతుండె. ఏకకాలంలో లక్షలోపు రుణమాఫీ కూడా అయితుండె. కానీ, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం వానకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలె. 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయలె. రైతుల పొట్టకొడితే ఊరుకోం. రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.
-దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (పెద్దపల్లి)