కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 23 : ఆరు జిల్లాల్లో విస్తరించి ఉండి.. లక్షలాది మంది బతుకులకు బాసటగా నిలుస్తున్న సింగరేణిని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబలుక్కొని అమ్మకానికి పెట్టాయని, అలా చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎన్నికల ముందర ప్రైవేట్‌పరం చేయమని చెప్పిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు నల్ల బంగారు గనులను మాయం చేసే కుట్రలు చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. బాధ్యతలు చేపట్టిన పది రోజుల్లోనే బొగ్గు బ్లాకులను వేలం వేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షంలో ఉన్ననాడు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మిన్నకుండిపోయి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య పాలనలో నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణిని కేసీఆర్ లాభాల బాట పట్టించారని చెప్పారు. ఇలాంటి గొప్ప సంస్థను తాకట్టుపెడితే రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారుతుందన్నారు. 133 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని అమ్మితే ఊరుకోబోమని, కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఆదివారం కరీంనగర్‌లోని తన క్యాంపు ఆఫీసులో కొప్పుల విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా తలొగ్గలేదన్నారు. సింగరేణిని రక్షించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడారన్నారు.
కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి దాసోహమైందన్నారు. ఒకవైపు బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నామని విలేకరుల ముందర ప్రగల్బాలు పలికిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..ఇప్పుడు వేలంలో పాల్గొనేందుకు సిద్ధపడడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వలను సొంత సర్వే ద్వారా వందల కోట్లు ఖర్చుపెట్టి వెలికి తీసిన సింగరేణిని ప్రైవేట్‌పరం చేయద్దని డిమాండ్ చేశారు. వేలం వేస్తున్న గనుల నుంచి శ్రావణ్పల్లిని మినహాయించాలన్నారు. దీనిపై రాష్ట్ర సర్కారు చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్రంలోని మోడీ సర్కారు లాభాల్లో ఉన్న సంస్థను అమ్మకానికి పెడితే సహించేదిలేదన్నారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగాలు పోతాయని, రిజర్వేషన్లు వర్తించవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కార్మిక సంఘాలు స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ రాష్ట్రనేతలు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్ పాల్గొన్నారు.