కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 16 : అలవికాని హామీలతో ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అవే అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముం దో మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతూ, రైతులకిచ్చిన హామీలు అమలు చేయడంలో అత్యంత హోరంగా వైఫల్యం చెందిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు.
కరీంనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలతో సీఎం రేవంత్ రాష్ట్ర రైతాంగాన్ని ఘోరంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలకు పోయారని, మూడు విడుతల్లోనూ పూర్తిస్థాయిలో చేయకపోవడం రైతులపై ఆ పార్టీకున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేశారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో లక్షలోపు రుణాల మాఫీకి 16,144 కోట్లు వెచ్చించి, 35 లక్షల మంది రైతులకు, 2018లో లక్షలోపు రుణమాఫీ కోసం 19,198 కోట్లు వెచ్చించి, 37 లక్షల మంది రైతులు తీసుకున్న రుణాలు చెల్లించిందని గుర్తు చేశారు. లక్ష రుణమాఫీలో బీఆర్ఎస్ సర్కారుతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏ మేరకు చేసిందో స్పష్టమవుతుందన్నారు. రైతు రుణమాఫీలో అడ్డగోలు కోతలు పెట్టి 46.25 లక్షల మంది రైతుల కడుపులు కొట్టిందని ధ్వజమెత్తారు. రెండు విడుతల్లో రుణమాఫీ కానీ రైతులంతా మూడో విడుత కోసం ఎదురుచూస్తుండగా, కేవలం 6 లక్షల మందికి మాత్రమే వర్తింపజేసి, చేతులు దులుపుకోవడం దుర్మార్గమని అన్నారు.
బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే 13 లక్షల మంది రైతులను అనర్హులుగా పేర్కొంటూ, కాంగ్రెస్ రుణమాఫీకి దూరం చేసిందని మండిపడ్డారు. జూలై 18న మొదటి విడుతలో 11.34 లక్షల మంది లక్ష లోపు రుణాలున్న రైతులకు 6 వేల కోట్లు, జూలై 30న విడుదల చేసిన రెండో విడుతలో 1.50 లక్షలలోపు రుణాలున్న 6.40 లక్షల మందికి 6,190 కోట్లు మాఫీ చేసిందని, మొత్తంగా 23.75 లక్షల మందికి 18,190 కోట్లు మాత్రమే మాఫీ చేసి, మొత్తం రైతాంగానికి రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పాసుబుక్కు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తామంటూ ముందుగా ప్రకటించి, తర్వాత రేషన్‌కార్డు ప్రామాణికంగా మాత్రమే రుణమాఫీ చేయడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశచరిత్రలో రైతులను ఇంత ఘోరంగా మోసం చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు, గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తీరు, రుణమాఫీ చేసిన తీరుకు ఏమాత్రం పొంతన లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉండడమే రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తున్నదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును రాజీనామా చేయాలనడం సీఎం అవివేకానికి నిదర్శనమన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేయడం రేవంత్‌కే చెల్లిందన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా, రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం వ్యవసాయరంగ బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ, రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టే అంతర్గత కుట్రతో కాంగ్రెస్ పాలన సాగిస్తున్నది. వెంటనే రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతుబంధును రైతు భరోసాగా మారుస్తూ, ఏటా ఎకరాకు 15 వేల పెట్టుబడి సాయంగా అందిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలి. రైతుకు భరోసా ఉన్నట్లా? లేనట్లా? మరోవైపు కౌలు రైతులు, రైతు కూలీల పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది.
– కొప్పుల ఈశ్వర్