కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనలో వరదల సమయంలో బాధితులకు కేసీఆర్ అండగా నిలిచారని, స్వయంగా పరామర్శించి ధైర్యాన్ని నింపారని చెప్పారు. అప్పుడు తక్షణ సాయం కింద ములుగు జిల్లాకు 2.5కోట్లు, భూపాలపల్లికి 2కోట్లు, మహబూబాబాద్‌కు 1.50కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి.. వరదల్లో చనిపోతే కుటుంబాలకు 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
వంతెన దెబ్బతిని ఉద్యోగానికి పోలేదు
మాది పెగడపెల్లి మండలం నామాపూర్. నేను గోపాల్రావుపేటలో ఉంట. పదహారేండ్లుగా కరీంనగర్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న. ప్రతి రోజూ అప్ అండ్ డౌన్ చేస్తున్న. రోజూ 35 కిలోమీటర్లు ప్రయాణించి డ్యూటీకి వెళ్తా. తిరిగి సాయంత్రం వస్తా. మిగతా కాలాల్లో బాగానే ఉన్నా, వానకాలం వచ్చిందంటే ఇబ్బంది అవుతున్నది. రామడుగు వాగు వరదలకు బ్రిడ్జి దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేస్తున్నరు. ఇప్పుడు డ్యూటీకి పోలేని పరిస్థితి. కొత్త వంతెన పూర్తయింది. కానీ, అందుబాటులోకి తేలేదు. ఈదారి మీదుగా రోజూ వేలసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటరు. అంత మందిని ఇబ్బంది పెట్టడం సరికాదు.
– ఇనుగండ్ల వీరహన్మంతరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ (రామడుగు)
ఆ దేవుడే దిక్కు
కొన్నేళ్లుగా వెంకటాద్రికాలనీల ఉంటున్నం. వానకాలం వస్తుందంటేనే వణికిపోతున్నం. జగిత్యాల పట్టణానికి కిలోమీటర్ దూరంలోనే ఉన్నా అరిగోసపడుతున్నం. చిన్నపాటి వర్షానికే గోవిందుపల్లె, వెంకటాద్రినగర్కాలనీ బ్రిడ్జి వరదకు నీట మునిగి రాకపోకలు నిలిచిపోతున్నయి. ఓపక్క ధరూర్ వాగు, మరోపక్క మోతె చెరువు, ఇంకోపక్క పొలాలున్నయి. ఒక్ర బ్రిడ్జి మీద నుంచి తప్ప ఎటూ పోరాదు. నాలుగు నెలలు వనవాసం చేస్తున్నం. ఇండ్లలోకి వరద వస్తున్నది. బురద మేట వేస్తున్నది. ఇండ్లలో ఉండలేం.. బయటికి పోలేం. ఈ నాలుగు నెలలు ఎక్కడికన్నా పోతే బాగుండు అనిపిస్తంది. ఈ సమయంల మాకు ఆపదొస్తే ఆ దేవుడే దిక్కు. పోయిన వానకాలం ఒకసారి ఐదు రోజులు వరుసగా రాకపోకలు బంద్ అయినయి. చానా గోస పడ్డం. జేసీబీ సాయంతో బ్రిడ్జి దాటినం. ప్రతిసారీ జేసీబీలు ఎక్కడి నుంచి వస్తయి? మా గోడు ఎవరూ పట్టించుకోవాలి. – ఎం వెంకటరమణ, వెంకటాద్రికాలనీ (జగిత్యాల టౌన్)
వర్షాకాలం అంటేనే వణుకు
వానకాలం వస్తుందంటేనే మా ప్రకాశం రోడ్డు కాలనీవాసులకు వణుకు పుడుతున్నది. ఏటా వరదతో ఇండ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు పడుతున్నం. విలువైన వస్తువులు నీటిలో మునిగి పాడవుతున్నయి. ఎన్నికల వేళ హడావుడి చేసే నాయకులు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం కనిపించరు. రాత్రి వేళల్లో వరదల్లో చిక్కుకుంటే ఆ దేవుడే దిక్కు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపాలి.
– సిరిపురం పావని, ప్రకాశం రోడ్డు కాలనీ (కోరుట్ల)
బిక్కుబిక్కుమని గడుపుతున్నం
చిన్నపాటి వర్షానికే మా ఝాన్సీ రోడ్డు కాలనీ ఇండ్లలోకి నీరు వస్తున్నది. విషసర్పాలు కొట్టుకు వస్తున్నయి. మా ఇంటి చుట్టూ నీరు చేరింది. పిల్లలతో బిక్కుబిక్కుమని గడుపుతున్నం. బయటకు వెళ్లేందుకు దారి లేక ఇంటిల్లి పాది భయపడుతున్నం. గతేడాది భారీ వర్షాలతో అర్ధరాత్రి వరద ఇంటిలోకి చేరింది. అప్పుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డం. పాలకులు, అధికారులు మాగోడు పట్టించుకోవాలి.
-గుండోజి మంగమ్మ, ఝాన్సీ రోడ్డు కాలనీ (కోరుట్ల)