పెద్దపల్లి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/ ధర్మపురి: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను ఎండగడుదామని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ తీసుకెళ్లి అవగాహన కల్పిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం (తెలంగాణ భవన్)లో గురువారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఆయన ఆవిష్కరించారు. పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో నిర్వహించిన ధర్మపురి, బుగ్గారం మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరై, ‘బాకీ కార్డు’లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలకూ బాకీ పడిందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఉద్యమాన్ని చేపట్టారని, ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ మోసాలను ఎండగడుతూనే, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన ఆ పార్టీ నాయకులను నిలదీసేలా ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రభుత్వం ఆ పార్టీలో ఉన్నోళ్ల కోసమే పని చేస్తున్నదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని, పేదోళ్లను విస్మరించారని విమర్శించారు. అనేక మంది అప్పులు చేసి ఇండ్లు కట్టుకుంటున్నారని, కానీ, బిల్లులు ఇవ్వడం రావడం లేదని, అసలు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పు 2 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ, కాంగ్రెస్ 22 నెలల పాలనలో లక్షా 60 వేల కోట్లు అప్ప చేసిందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అప్పులతో కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణ చివరి స్థానానికి పడిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసి అభివృద్ధి చేసిందని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచిందని చెప్పారు.
ఆ అభివృద్ధి, సంక్షేమం ప్రతి చోటా కనిపిస్తున్నదని, మనం ఈ గులాబీ కండువా కప్పుకొని ఎక్కడికి వెళ్లినా మనల్ని గౌరవించే పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజల్లో ఎవరిపై మంచి అభిప్రాయం ఉందో తెలుసుకొని టికెట్లు ఖరారు చేసుకుందామని, వారినే గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జడ్పీటీసీలు గంట రాములు, వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు నూనేటి సంపత్, మోహన్‌రావు, బీఆర్ఎస్ పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్‌కుమార్, గుణపతి, పార్టీ మండల అధ్యక్షులు మార్క్ లక్ష్మణ్, బైరెడ్డి రాంరెడ్డి, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సందీప్‌రావు, పాలరామారావు, నిదానపురం దేవయ్య, టీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ కొయ్యడ సతీశ్, సూర శ్యాం, ముబీన్, పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకూ మేం అండగా ఉంటాం. ఏ పరిస్థితిలోనైనా మీకు తోడుంటాం. ఏ ఒక్కరూ వెనుకడుగు వేయవద్దు. కాంగ్రెస్ మనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు దిగినా ఎదుర్కొందాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ తరఫున ఒక్కొక్కరినే బరిలో ఉంచుదాం. అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారం మండల నాయకులు నా దృష్టికి తెచ్చారు. సమాలోచనలు చేసి అభ్యర్థులను నిలుపుదాం. వారినే గెలిపించుకుందాం. అందుకోసం అందరం నిజాయితీగా పనిచేద్దాం. మన పార్టీ గెలుపుకు కృషి చేద్దాం.
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం. మనపై ఎదుటి పార్టీ వాళ్లు చేసే కుట్రలు, కుతంత్రాలను పసిగట్టి తిప్పి కొట్టాలి. ప్రతి కార్యకర్త మెడలో ఉన్న గులాబీ కండువా జెండా అయి ఊరిలో ఎగరాలి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారిని, మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పల్లెపల్లెనా.. ఇంటింటా ఉన్నది. ప్రజలు మనకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.