మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్‌రెడ్డి పార్టీని వీడడం కల్లోలం సృష్టిస్తున్నది. తన నలభై రెండేళ్ల సేవలకు విలువ లేకుండా పోయిందని, రేవంత్.. ఆయన వర్గం వలసవాదులకు పెద్దపీట వేసి తనను అడుగడుగునా అవమానించిందని, ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెట్టారంటూ ఆయన రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగున్నర దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన నాయకుడికే గుర్తింపు లేనిచోట తమకెలా ఉంటుందని సీనియర్ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జీవన్‌రెడ్డి బలవంతంగా బయటికి రావడం, ఆయన వెంటే వేలాది మంది కదులుతుండడంతో ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని పోగొట్టుకోవడం కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : నలభై రెండేళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన ఆయన, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇతర సామాజిక అంశాలపై సైతం తనదైన ముద్రవేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా తన స్వరం గట్టిగా వినిపించేవారు. మాస్ లీడర్‌గా ఎదిగిన జీవన్‌రెడ్డికి జగిత్యాల నియోజకవర్గంతోపాటు ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం మండలాల్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అనుచరులుగా ఉన్నారు. అలాగే చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
మానకొండూర్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మానసిక వేదనకు గురైన ఆయన, తాజాగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. తనను అణగదొక్కేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన పెట్టుబడిదారులు కుట్ర చేశారని, ప్రతి విషయంలోనూ అవమానాలకు గురిచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వేలాది మంది అనుచరుల సమక్షంలో రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీలోని నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజీనామాతో సంచలనం
జీవన్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్‌లో నిరాదరణకు గురవుతున్న విషయం బహిర్గతం కావడం, ఆయన సైతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ తీరు, ప్రభుత్వ ఉదాసీన వైఖరి, హామీల అమలులో నెలకొన్న ప్రతిష్టంభన, అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న శ్రేణులను అధిష్టానం చులకనగా చూడడాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమైన జీవన్‌రెడ్డికి టచ్‌లోకి వెళ్లారు. బుధవారం జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో నిర్వహించిన సమావేశానికి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు ఇటీవల కాంగ్రెస్ సింబల్‌తో పాటు ఇండిపెండెంట్లుగా మున్సిపాలిటీల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు సైతం తరలివచ్చారు.
జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భర్త మున్నా సైతం వెంటే ఉన్నారు. వారంతా జీవన్‌రెడ్డితో కలిసి ముందుకు సాగుతామని, కాంగ్రెస్‌ను, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గంతోపాటు ధర్మపురి నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, సభ్యులు సైతం రాజీనామాలు చేసి, జీవన్‌రెడ్డికి జై కొట్టారు. కొడిమ్యాల, మల్యాల మండలాలకు చెందిన నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. మొత్తంగా రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు మొదలు కాగా, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జీవన్‌రెడ్డి అనుచర వర్గం, క్యాడర్ విస్తరించి ఉండడంతో కలవరపడుతున్నారు.
ప్రజాప్రతినిధుల్లో గుబులు
జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో గుబులు మొదలైంది. ప్రభుత్వ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతుండడంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుందని గుర్తించిన వారు, రేవంత్‌రెడ్డి పనితీరుపై అంతర్గత సమావేశాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పార్టీలోకి వలసవాదులకు పెద్దపీట వేస్తూ పాత కేడర్‌ను విస్మరిస్తుండడంపై నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తనను అణగదొక్కేందుకు కుట్రలు చేశారని, తనను ప్రతి విషయంలోనూ అవమానించారంటూ జీవన్‌రెడ్డే ప్రకటించడంతో తమ పరిస్థితి ఏంటని అంతర్మథనం చెందుతున్నారు.
నాలుగున్నర దశాబ్దాల పాటు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడికే గౌరవం దక్కని చోట తమలాంటి వారికి ఏం దక్కుతుందని ఆలోచనలో పడ్డారు. ఇటు రైతు భరోసా ఇవ్వకపోవడం, పెన్షన్ల పెంపు, తులం బంగారం, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేకపోవడం, రిటైర్ ఉద్యోగుల పెన్షన్ ఊసేలేకపోవడం వంటి విషయాల్లో సర్కారు ప్రజల్లో పూర్తిగా పలుచన అయిపోయిందని, ఇలాంటి తరుణంలో జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు పార్టీ మారడం అనేక తలనొప్పులను తెస్తుందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరగడం, గులాబీ నాయకులు సైతం నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుండడం, ఇలాంటి సమయంలో వారికి జీవన్‌రెడ్డి తోడైతే తమ ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండడం, అన్ని వర్గాల ప్రజలతో జీవన్‌రెడ్డికి సత్సంబంధాలు కలిగి ఉండడం పార్టీకి నష్టం చేస్తుందని చెబుతున్నారు. జీవన్‌రెడ్డి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న నేపథ్యంలో ఆయనపై భవిష్యత్తులో రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయడం సైతం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయన వెంటే అనుచరులైన ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీనామాలు చేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఏదేమైనా జీవన్‌రెడ్డి రాజీనామా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ టార్చర్ అంతా ఇంతా కాదు
నేను నలభై రెండేళ్ల పాటు నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేసిన. కానీ, నన్ను అణగదొక్కేందుకు సీఎం రేవంత్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. ఆయన పెట్టుబడిదారి వర్గం నన్ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. జగిత్యాల ఎమ్మెల్యేను ఉద్దేశపూర్వకంగా పార్టీలోకి తీసుకొని నన్ను, నా కార్యకర్తలను అడుగడుగునా అవమానించిన్రు. ఆత్మగౌరవం లేని చోట పనిచేయడం ఇష్టం లేక కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న. జగిత్యాల వేదికగా చెబుతున్న. నన్ను ఏ శక్తి ఆపలేదు. నన్ను అవమానించి, బాధించి బయటకు పంపిస్తున్న రేవంత్‌రెడ్డిపైనే నా పోరాటం సాగుతుంది.
– మాజీమంత్రి జీవన్‌రెడ్డి