కొత్తపల్లి, మే 14: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెడితే ఏమాత్రం ఊరుకునేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనాలని, కరీంనగర్ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో మిల్లుల యజమాన్యాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వమే భరించుకోవాలని సూచించారు. రైస్‌మిల్లుల నుంచి ధాన్యం దించుకొని ఓటీపీ ఇచ్చే బాధ్యత సర్కారుదేనని, ఒకవేళ రైతులను ఇబ్బంది పెట్టినా, కొర్రీలు పెట్టినా వారితో కలిసి రైస్ మిల్లుల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
గురువారం కొత్తపల్లి మండలం చింతకుంట కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లలో ఏర్పడుతున్న జాప్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదనపు కలెక్టర్, డీఎస్వో, డీఎంతో ఆయన ఫోన్లో మాట్లాడి రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని సూచించారు. అనంతరం గంగుల మాట్లాడారు. ధాన్యం తూకంలో బస్తాకు 40కిలోల 600 గ్రాములు పెట్టాల్సి ఉందని, కానీ ఈ ప్రభుత్వం 42 కిలోలు తూకం వేస్తున్నదన్నారు. రైతులకు నష్టమే అయినప్పటికీ కొనుగోళ్లు వేగవంతంగా సాగుతాయని అంగీకరించారని చెప్పారు.
ఇది చాలదన్నట్టు రైస్‌మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని, బస్తాకు 43 కిలోల ధాన్యం తూకం వేయాలని రైతులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆక్షేపించారు. రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం, అధికారులు మిల్లులకు వంతపాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసామని గుర్తు చేశారు. పదేండ్లలో రాని సమస్య కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డు మీదకు రాకముందే కొనుగోళ్లు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి మహేశ్, భూక్య తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్, కమల్ పాల్గొన్నారు.