కరీంనగర్ రూరల్, మే 27 : తడిసిన ధాన్యం బాధ్యత అధికారులదేనని, వెంటనే కొనకుంటే అధికారుల ఇంటి ముందే పోస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకు ఒక మంత్రి లేరని, కలెక్టర్, అధికారులే పూర్తి బాధ్యులు అవుతారని సూచించారు. తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నా రాష్ట్ర సర్కారు పూర్తిగా మొద్దునిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్లు, హమాలీలు, లారీల కొరత ఉన్నా అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుందన్నారు.
కేసీఆర్ పాలనలో మే 5లోగా పూర్తిగా ధాన్యం కొని డబ్బులు చెల్లించామని, ఇప్పుడు మే చివరి వారం వచ్చినా 50 శాతం కూడా కొనలేదని విమర్శించారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూర్, చేగుర్తి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నగునూర్‌లో కుప్పలను చూసి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి సెంటర్ వద్దకు రావాలని, వచ్చే వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సెంటర్‌కు ధాన్యం తెచ్చి నెలలు గడుస్తున్నా పటించుకున్న నాథుడే లేడని, మంగళవారం రాత్రి పడిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన చెందారు. వారి గోడున్న విన్న ఎమ్మెల్యే చలించిపోయారు.
బస్తాకు 42 కేజీల కంటే ఎక్కువ పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. అడిషనల్ కలెక్టర్‌తో మాట్లాడి ఏఎంసీలోని గోదాం నంబర్ 7లో ఉన్న ఇందిరమ్మ చీరెలను ఖాళీ చేస్తున్నారని, ధాన్యం నిల్వకోసం దానిని కేటాయించాలని కోరారు. సివిల్ సప్లయ్ అధికారులను పిలిపించి సమస్యలపై నిలదీశారు. అప్పటికప్పుడు హమాలీలు, గ్రామంలోని ట్రాక్టర్లను మాట్లాడి ధాన్యాన్ని తరలించారు. రెండు రోజుల్లో సెంటర్ నుంచి మొత్తం ధాన్యాన్ని తరలించాలని సూచించారు. కొనుగోలు చేసే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.
చేగుర్తి కేంద్రంలో తడిసిన ధాన్యం, రైతుల దీనస్థితిని చూసి చలించారు. ధాన్యమంతా తడిసిందని, తమకు దిక్కెవరని, ఆత్మహత్యే శరణ్యమని ఈ సందర్భంగా స్థానిక రైతులు ఎమ్మెల్యేకు చెప్పుకుంటూ వాపోయారు. తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం కల్పించారు. ఇక్కడ కూడా అప్పటికప్పుడు హమాలీలు, ట్రాక్టర్లను తీసుకువచ్చి ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే వెంట కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, డైరెక్టర్ సాయిల మహేందర్, సుంకిశాల సంపత్‌రావు, వరి భద్రయ్య, కస్తూరి రాంరెడ్డి, దుర్శేడ్ ప్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మహేందర్, సీఈవో వేణుమాదవ్, పబ్బతి రంగారెడ్డి, తదితరులు ఉన్నారు.