కార్పొరేషన్, ఫిబ్రవరి13: బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన సమీప బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడని ఆరోపిస్తున్నాడని, దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సోయిలేని మాటలు మానుకుని అసలు నిజాలేంటో నిరూపించాలని, లేదంటే తాను మాట్లాడింది తప్పని ఒప్పుకోవాలని హితవుపలికారు. మాట్లాడితే గొప్పలు చెప్పుకునే ఆయన ఈ ఐదేండ్లలో కరీంనగర్‌కు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు. సంజయ్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.
తాను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నానని, అంతకు ముందు పొన్నం ప్రభాకర్, కేసీఆర్, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎల్ రమణ ఎంపీలుగా ఉన్నారని, అందులో ఎవరి బంధువులకు మేడిగడ్డ బ్యారేజ్ సబ్ కాంట్రాక్టు ఇచ్చారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన మాటలు విని నవ్వాలో, ఏడ్వాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఓ ఎంపీ హోదాలో మాట్లాడుతున్నప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సరికాదని, పేరు చెప్పే ధైర్యం లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. ఎల్అండ్టీ అనేది ఓ మల్టీనేషనల్ కంపెనీ అని, అలాంటి సంస్థలు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. సంజయ్‌కు ఇన్నాళ్లు ప్రజలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
ఆయన ఐదేళ్లలో చేసిందేమీ లేదని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు రూపాయల పని చేయలేదని మండిపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ, తదితర పథకాలకు వస్తున్న నిధులను తానే తెచ్చానంటూ పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధికి ఆయన ఒక్క రూపాయి తీసుకువచ్చారా..? అని ప్రశ్నించారు. తాను వైవీ సుబ్బారెడ్డిని ఒప్పించి కరీంనగర్‌కు టీటీడీ నుంచి 25 కోట్లతో వేంకటేశ్వర దేవాలయం తీసుకువచ్చామన్నారు.
హిందుత్వం అని చెప్పుకునే బండి ఇప్పటి వరకు ఒక్క గుడి, కనీసం బడికైనా..? నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతాడన్న భయంతోనే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టిప్పర్ ఉత్తరాలు రాశాడు కానీ, తట్టెడు మట్టి పోయలేదని తనపై విమర్శలు చేసిన సంజయ్, ఎంపీగా ఏం చేయాలో తెలుసుకోవాలని హితవుపలికారు. తాను ఎంపీగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అనేక ఉత్తరాలను ప్రభుత్వాలకు రాశానని గుర్తు చేశారు. ఉత్తరాలు రాసి ఏం చేశానో..? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెబుతానని స్పష్టం చేశారు. ఇక మీదట ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, ప్రతి అంశంపై తాము ధీటుగానే స్పందిస్తామని హెచ్చరించారు.
మేడిగడ్డ విషయంలో జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని తమ పార్టీ కోరిందని, అలాగే జరిగిన దానిని వెంటనే సరిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీఎం మంగళవారం మేడిగడ్డకు వెళ్తున్నందున అక్కడ ఆ కంపెనీ సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చిందో లేదో సృష్టత ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలన్నారు. ప్రతి సమస్యపై స్పందించే గుణం బీఆర్ఎస్కు ఉందన్నారు. తాము నల్లగొండ సభ పెడుతున్నందు వల్లే కృష్ణా జలాలకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. సమావేశంలో గంగాధర ఎంపీపీ మధుసూదన్, బీఆర్ఎస్ నాయకులు హమీద్, జక్కుల నాగరాజు, దూలం సంపత్ గౌడ్, వోల్లాల శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.