కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 22 : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణపై దృష్టి పెట్టాలని, రైతుల్లో అవగాహన పెంచి, నిర్దేశించిన లక్ష్యానికి మించి తోటలు పెంచేలా ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచించారు. ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి కరీంనగర్‌కు వచ్చారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయం, విద్య, గృహనిర్మాణం, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధితశాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని సూచించారు. వచ్చే నెల నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. రాబోయే మూడున్నరేండ్లలో శాచురేషన్ పద్ధతిలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ యంత్రాంగం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తీవ్రంగా కృషి చేయాలన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు అందించే నిరుపేదల జాబితాలు కూడా పరిశీలించి, అర్హులైన వారికి పార్టీలకతీతంగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరి సాగు కొంతమేర తగ్గిస్తూ ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖాధికారులు కృషి చేయాలన్నారు. సమీక్ష అనంతరం జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నంతో కలిసి తుమ్మల ప్రారంభించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సత్యప్రసాద్, కోయ శ్రీహర్ష, సందీప్‌కుమార్‌ఝా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, జనక్‌ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు కోరుట్ల, మానకొండూర్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టిన సందర్భంలో పదో తరగతి చదివే విద్యార్థి ఐదో తరగతి పుస్తకాలు చదవలేక పోతున్నాడని ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్యానించడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అవాక్కయ్యారు. డీఈవో మొండయ్య మాట్లాడుతున్న సమయంలో కాగితాలపై ఉన్న ప్రగతి కాదు.. క్షేత్రస్థాయిలో చేపట్టే పరిశీలనపై వివరాలు వెల్లడించాలని మంత్రి పొన్నం అడగడంతో డీఈవో మిన్నకుండిపోయారు.
కమాన్‌చౌరస్తా, జూన్ 22: జిల్లా కేంద్రంలో మానేరు డ్యాం సమీపంలోని శాతవాహన ఫార్మసీ కళాశాలలో అకాడమిక్ బ్లాక్, ప్రహరీకి ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నదని, విశ్వవిద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచుతామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, పీఎం ఉష కింద విడుదలయ్యే నిధులను ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి కేటాయించినట్టు తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయంలో అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్ తదితరులు పాల్గొన్నారు.