Flood water | మంథని, మే 28: చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో దొంతులవాడ, భగత్‌నగర్, రావుల చెరువుకట్టలతో పాటు సత్యసాయినగర్, పద్మశాలివీధితో పాటు పలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా మంథని పట్టణంలోని అన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టిన విషయం విధితమే. అయితే అండర్ డ్రైనేజీ నిర్మాణ సమయంలో కొన్ని వార్డుల్లో పెద్ద పైపులు, మరికొన్ని వార్డుల్లో చిన్న పైపులను వేసి పనులు నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక తప్పిదం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో నిర్వహించిన పనులు పట్టణ ప్రజలకు శాపంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
అండర్ డ్రైనేజీలు చిన్న పైపులతో నిర్మించడంతో వర్షపు నీరు రోడ్లపైకి పారి ఆయా వార్డుల్లో ఉన్న ఇళ్లలోకి చేరుతుంది. కేవలం ఈ చిన్న వర్షానికే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న వర్షా కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఏంటో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో కాంట్రాక్టర్ ఇలా ఇష్టా రాజ్యం పనులు నిర్వహించడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వర్షాకాలం ప్రారంభం కాక ముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.