Tatiparthi Jeevan Reddy | జగిత్యాల, ఆగస్టు 22 : మత్స్యకారుల సొసైటీలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారమందించాలని బీఅర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్, చెర్లకొండాపూర్ గ్రామాల మత్స్య సహకార సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తోపారపు రజనీకాంత్ తదితరులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన మత్స్య సహకార సంఘాల సభ్యులను జీవన్‌రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరంభం నుంచే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులు, కుంటలపై మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజులకు ఆధిపత్యం కల్పించారని పేర్కొన్నారు. అయితే కొన్ని గ్రామాల్లో మత్స్యకారుల సొసైటీల ఏర్పాటుకు భూస్వామ్య వర్గాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని అన్నారు. గంగపుత్రులు, ముదిరాజుల విజ్ఞప్తి మేరకు అధికారులు చొరవ తీసుకుని ఆయా గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. చేపనారును వర్షాకాలం ప్రారంభంలోనే చెరువుల్లో వదలాల్సి ఉండగా, డిసెంబర్, జనవరి నెలల్లో పంపిణీ చేయడం వల్ల చేపనారు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం సకాలంలో చేపనారు పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారని అన్నారు. జగిత్యాల జిల్లాలో 700కు పైగా చెరువులు ఉన్నప్పటికీ గత ఏడాది కేవలం 250 చెరువులకు మాత్రమే చేపనారు పంపిణీ చేశారని తెలిపారు. చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా చేపనారు పంపిణీకి సంబంధించిన నిధులను మత్స్యకారుల సొసైటీలకు నగదు రూపంలో అందించాలని కోరారు. సొసైటీలకు నిధులు అందిస్తే మత్స్యకారులు నాణ్యమైన చేపనారును సకాలంలో కొనుగోలు చేసి చెరువుల్లో వదిలే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని మత్స్యకారులతో సొసైటీలు ఏర్పాటు చేసి చెరువులు, కుంటలపై వారికే పూర్తి ఆధిపత్యం కల్పించాలని జీవన్‌రెడ్డి అన్నారు. చెరువుల ఆక్రమణలను అరికట్టకపోవడం వల్ల చెరువుల విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి భూగర్భ జలాలు సైతం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలోని మోతే, ముప్పారపు, కల్లేపల్లి చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు. ముప్పారపు చెరువును ఆక్రమించి రియల్ ఎస్టేట్‌కు వినియోగిస్తున్నారంటూ రైతులు, మత్స్యకారులు ఆందోళనలు చేసినప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమైందనడానికి నిదర్శనమని విమర్శించారు. చెరువుల్లో మట్టి పోసి ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు.