రాజన్న సిరిసిల్ల, జూలై 3 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రాష్ట్రంలోనే మొదటిసారిగా రోడ్ సేఫ్టీ విలేజ్, హైవే కమిటీలను ఏర్పాటు చేశారు. 255 గ్రామాల పరిధిలో గ్రామానికి ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో మొత్తం 1275 మంది సభ్యులున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న పెట్రోలు బంకులు, దాబాలు, హోటళ్లలో పనిచేసే 200 మందిని గుర్తించి కమిటీలు ఏర్పాటు చేశారు. వీరు రోడ్డు ప్రమాదాలపై తక్షణమే స్పందించి క్షతగాత్రులకు చికిత్స అందించేలా ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ వివిధ ఎమర్జన్సీ వైద్యం పై నెలకు రెండు సార్లు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటగా ప్రైమరీ హెల్త్ సెంటర్లలోని వైద్యులతో..
ఆ తర్వాత జిల్లాస్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖ వైద్యులతో శిక్షణ ఇప్పించనున్నారు. ప్రమాదాల్లో విలువైన మనుషుల ప్రా ణాలు కాపాడిన వారికి గూడ్ సమర్థన్ అవార్డులను అందించనున్నారు. సోమవారం ఈ కమిటీలకు జిల్లా కేంద్రంలోని కల్యాణలక్ష్మి గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై, సలహాలు సూచనలు అందించారు. రోడ్ సేఫ్టీ కమిటీల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువతను ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ఫస్ట్ రెస్పాండర్‌గా ఉండి మనుషుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్ సేఫ్టీ కమిటీలు చురుగ్గా పనిచేస్తాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కమిటీలను ఏర్పా టు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ లు రవికుమార్, అనిల్‌కుమార్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రావు, వైద్యులు, వలంటీర్లు పాల్గొన్నారు.
ప్రథమ చికిత్స ప్రాణం పోస్తుంది
ప్రస్తుతం 98శాతం రోడ్డు ప్రమాదాలతోనే మరణాలు సంభవిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో గాయపడ్డ వ్యక్తలకు కొన్నిసార్లు మనం అందించే ప్రథమచికిత్సే ప్రాణాలు పోస్తుంది. అందుకే రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామస్థాయిలో రోడ్ సేప్టీ కమిటీలను ఏర్పాటు చేశాం. క్షతగాత్రులను కాపాడేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్, ఏడీఏ మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాల తీవ్రతను గుర్తించడం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్‌గా గుర్తించి సాధ్యమైనంత త్వరగా వ్యక్తిని బ్రతికించడానికి ప్రయాత్నం చేయాలి. వలంటీర్లు కాపాడే వ్యక్తినే కాదు, ఆ కుటుంబాన్ని. ఈ కమిటీలో స్వచ్ఛందంగా శిక్షణ పొందడానికి వచ్చిన మీకు నా అభినందనలు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి జనవరి 26, జూన్ 2, ఆగస్టు 15వ రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందిస్తాం.
– అఖిల్ మహాజన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ
ఎస్పీకి ప్రత్యేక అభినందనలు
రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది సకాలంలో చికిత్స అందకనే ప్రాణాలు కోల్లోతున్నారు. ఇలాంటి వారికి ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయడం నిజంగా మంచి కార్యక్రమం. ఎస్పీకి నా అభినందనలు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయడం, శ్వాస అందించడం, దవాఖానలకు తరలించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తాం. ఇలా చేయడం వల్ల ఎంతో మందిని మనం కాపాడవచ్చు.
– మురళీధర్‌రావు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ (సిరిసిల్ల)