Fire Accident | కాల్వశ్రీరాంపూర్, మే21 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు. సాగర్ కు గ్రామ శివారులో ఎకరా 20గుంటల వరి పొలం ఉంది. హార్వెస్టర్లు రాక పొలం కోయలేదు. గురువారం ఉదయం ఓ గ్రామానికి చెందిన హార్వెష్టర్ పొలం కోయడానికి రాగా అప్పటికే మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్షా యాభైవేల ఆస్థినష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు.
గ్రామ శివారులో మిట్ట మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యకాలుకు నిప్పంటించడంతో పలువురు రైతులకు చెందిన వరి కొయ్యకాలుతో పాటు, విద్యుత్ వైర్లు, పైపులు, తాటిచెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. రూ.లక్షల్లో ఆస్థినష్టం జరిగినట్లు గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులు ఫైర్ ఇంజన్‌కు సమాచారమిచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చే సరికి పొలం మొత్తం మంటల్లో బూడిదైంది. వరికొయ్యకాలుకు నిప్పంటించిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.